Domestic Betrayal | మంటగలిసిన మానవత్వం.. భర్తను చంపిన భార్య!

‘ఈ ఘర్షణలో మనీషా, లక్ష్మణ్‌ ఇద్దరూ కలిసి, కిసాన్‌ మెడను ఒక తాడుతో బిగించి చంపారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వారిద్దరూ ఆ శవాన్ని ఒక బెడ్డింగ్‌ మెటీరియల్‌లో చుట్టి.. నది వరకూ తీసుకెళ్లి సాక్ష్యాలు దొరకకుండా అందులో పడేసి వెళ్లిపోయారు’

Thane Crime

Domestic Betrayal | మంటగలుస్తున్న మానవ సంబంధాలకు మరో మచ్చుతునకగా నిలుస్తున్నదీ విషాద ఘటన. 44 ఏళ్ల వ్యక్తిని ఆయన భార్య, పొరుగింటి వ్యక్తి కలిసి, మెడపిసికి హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని ఠాణె జిల్లా బద్లాపూర్‌ వద్ద నదిలో పడేసి, పరారయ్యారు. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బద్లాపూర్‌ పోలీసులు నిందితుల కోసం వెతులాడుతున్నారు.
మృతుడిని బద్లాపూర్‌కు చెందిన కిసాన్‌ పర్మార్‌గా గుర్తించినట్టు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ కిశోర్‌ షిండే తెలిపారు. తన భార్య మనీషాతో కలిసి జీవిస్తున్నాడు. దర్యాప్తులో మృతుడి భార్యకు పొరుగునే ఉంటున్న లక్ష్మణ్‌ భొయిర్‌ (36) అనే వ్యక్తితో అక్రమసంబంధం ఉందని వెలుగు చూసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.. అంతిమంగా.. కిసాన్‌ హత్యకు దారి తీసింది. ‘ఈ ఘర్షణలో మనీషా, లక్ష్మణ్‌ ఇద్దరూ కలిసి, కిసాన్‌ మెడను ఒక తాడుతో బిగించి చంపారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వారిద్దరూ ఆ శవాన్ని ఒక బెడ్డింగ్‌ మెటీరియల్‌లో చుట్టి.. నది వరకూ తీసుకెళ్లి సాక్ష్యాలు దొరకకుండా అందులో పడేసి వెళ్లిపోయారు’ అని షిండే తెలిపారు.

ఆ వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ రోజు సాయంత్రం స్థానికులు నదిలో అనుమానాస్పదంగా తేలుతున్న బెడ్డింగ్‌ను గుర్తించి, అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపించారు. గొంతు నులిమడం వల్లే మరణం చోటు చేసుకుందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని షిండే తెలిపారు. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఇది అక్రమసంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన హత్యగా గుర్తించామని చెప్పారు.

ఇద్దరిపై బీఎన్‌ఎస్‌లోని సెక్షన్‌ 103 (1) (హత్య), 288 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఠాణె జిల్లా చుట్టుపక్కల తీవ్రంగా జల్లెడపడుతున్నారు. లక్ష్మణ్‌తో అక్రమ సంబంధం నెరపుతున్నదని కిసాన్‌ గుర్తించిన నేపథ్యంలో గత కొద్దివారాలుగా భార్యా భర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హత్య జరగడానికి ముందు రోజు కూడా వారి ఇంట్లో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినట్టు శబ్దాలు వినిపించాయని ఇరుగుపొరుగువారు కూడా ధృవీకరించారని పోలీసులు తెలిపారు. ‘శవాన్ని నదిలో పడేస్తే దానిని పోలీసులు గుర్తించడానికి సమయం పడుతుందని నిందితులు భావించి ఉంటారు. కానీ సాంకేతికంగా, స్థానిక ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా మాకు ఇప్పటికే కీలక ఆధారాలు లభించాయి’ అని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఇద్దరు నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది.

Read Also |

Komati Reddy : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రికార్డు..రూ. 60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణం
Hanamkonda : కోళ్ళు…కోళ్ళూ ఊరంతా కొక్కురోకో
అమెరికాలో ట్రంప్‌నకు ఎదురైన ‘కేజ్రీవాల్‌’!