Site icon vidhaatha

వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య

Minor Girl Suicide: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం రేపింది. రంగనాయకుల గుట్టకు చెందిన మైనర్ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. స్థానికంగా ఉండే బాలుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆ మైనర్ బాలికను బాలుడు ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. బాలుడి ఇంటికి వెళ్లి మందలించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులు సెలెంట్ గా ఉన్న బాలుడు మళ్లీ వారం రోజులుగా వేధింపులకు దిగాడు.

తన సోదరుడి ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌‌నుంచి బాలికకు అసభ్య మెసేజ్‌లు, వీడియో కాల్‌ చేస్తుండటంతో.. తన తండ్రికి విషయం తెలియజేసింది. రెండు రోజుల క్రితం బాలిక తండ్రి హయత్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడు నిన్న బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్లి బెదిరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంవల్ల తన కుమార్తె చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version