రెంటికి చెడ్డ రఘురామ

బీజేపీ రాజకీయాలు అర్థం కాక రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్లు జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం అభ్యర్థిగా గెలిచిన

  • Publish Date - March 25, 2024 / 01:39 PM IST

  • వైసీపీపై విరుచుకుపడ్డ వైసీపీ ఎంపీ
  • టీడీపీ లేదా బీజేపీ నుంచి టికెట్‌ ఆశలు
  • పొత్తులో బీజేపీకి దక్కిన నర్సాపూర్‌
  • రఘురామకృష్ణం రాజు కింకర్తవ్యం?

విధాత ప్రత్యేకం: బీజేపీ రాజకీయాలు అర్థం కాక రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్లు జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం అభ్యర్థిగా గెలిచిన ఆయన తర్వాత అదే పార్టీలో తిరుగుబాటు నేతగా కొనసాగుతూ నిత్యం జగన్‌పై విరుచుకుపడ్డారు. దీంతో పత్రికల్లో పతాకశీర్షికల్లో కనిపించినా ఎన్నికల సమరం వచ్చే సరికి ఆయన పోటీలో లేకుండా పోయారు. ఒకరకంగా ఇది ఆయన స్వయంకృతమే అనుకోవాలి.

రఘురామ రాజు తనకు టీడీపీ టికెట్‌ ఇస్తుందని ఆశించారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపురం లోక్‌సభ స్థానం బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ పార్టీ ఆయనకు టికెట్‌ రాకపోవడానికి కారణం జగన్‌ అని ఆరోపించడం ఆశ్చర్యం. ఆయనకు టికెట్‌ ఇవ్వాల్సింది టీడీపీ. ఆయన ప్రశ్నించాల్సింది ఆ పార్టీ అధినేతను. పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్‌ బీజేపీకి ఎందుకు ఇచ్చారన్న విషయంపై అడగాల్సింది కూడా టీడీపీ, జనసేన అధినేతలనే. కానీ సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే తనకు టికెట్‌ దక్కుండా చేశారని ఆరోపించడం విడ్డూరంగా ఉన్నది.

నిజానికి బీజేపీ కాంగ్రెస్‌ పార్టీతో తప్పా ఏ ప్రాంతీయపార్టీతో శాశ్వత శతృత్వం గాని, మితృత్వం గాని పెట్టుకోవడం లేదు. తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా తన విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నది. ఇందులో భాగంగానే కర్ణాటకలో జేడీఎస్‌, బీహార్‌లో జేడీయూ, ఏపీలో టీడీపీ వంటి పార్టీలను తిరిగి ఎన్డీఏలో చేర్చుకున్నది. ఇదంతా వాళ్ల స్వప్రయోజనాల కోసం అన్నది రఘురామకృష్ణం రాజు లాంటి వారికి అర్థం కాక జగన్‌పై ఘర్షణకు దిగారని అంటున్నారు. ఏపీలోనూ బీజేపీ ఎన్నికలకు ముందు ఉన్న కూటమితోనే ఫలితాల అనంతరం కొనసాగిస్తుందా? అంటే అనుమానమే. ఎందుకంటే లోక్‌సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిన వైసీపీకి వ్యతిరేకంగానే ఇప్పుడు ఎన్నికల్లో నిలబడింది. దీన్నిబట్టి బీజేపీకి పొత్తుల విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలు ఏమీ లేవని గత పదేళ్ల కాలంలో వివిధ ప్రాంతీయపార్టీలపై ఆ పార్టీ వైఖరిని చూస్తే తెలుస్తుంది. బీజేపీ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిస్తే ఎంత పెద్ద నేతలనైనా పార్టీలను పక్కనపెడుతుంది. నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కర్ణాటకకు చెందిన అనంతకుమార్‌ హెగ్డే, ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, ఢిల్లీకి చెందిన ఆ పార్టీ ఎంపీ రమేశ్‌ బిధూరీ వంటి వారికి టికెట్లు నిరాకరించింది. అలాంటిది తమ పార్టీలో చేరని, ఇతర పార్టీలో ఉన్నరఘురామ కృష్ణంరాజు లాంటి వారికి మద్దతు ఇస్తుందనుకోవడం ఊహించలేనిది. ఈ రకంగా రఘురామ రెంటికి రెడ్డ రేవడిలా తయారయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News