- ఆదివారం రాజీవ్ జయంతి
- ఆ రోజు పాంగాంగ్ సరస్సు వద్ద రాహుల్ పూజలు
Rahul Gandhi |
న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ ప్రధాని రాహుల్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్‌కు బైక్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో రాహుల్ పంచుకున్నారు.
కేటీఎం 390 అడ్వంచర్ బైక్‌పై రాహుల్ ముందు వెళుతుండగా.. మరికొంతమంది ఆయనను ఫాలో అయ్యారు. హెల్మెట్, గ్లవ్స్, రైడింగ్ బూట్స్, జాకెట్‌తో ఫుల్ బైకింగ్ గేర్‌తో కనిపించారు. ఈ ఫొటోలను కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేసింది.
‘పాంగాంగ్ లేక్ వెళుతున్నాను. ప్రపంచంలోనే అతి సుందర ప్రదేశాల్లో అదొకటని నా తండ్రి చెబుతూ ఉండేవారు’ అని రాహుల్ పోస్ట్ చేశారు. ఆదివారం రాజీవ్‌గాంధీ జయంతి. తన తండ్రికి ఇష్టమైన ప్రదేశం కావడంతో అక్కడ పూజలు నిర్వహించేందుకు రాహుల్ బయల్దేరారు.
20వ తేదీన పాంగాంగ్ లేక్ వద్ద రాహుల్ పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం లద్దాఖ్ చేరుకున్న రాహుల్.. అక్కడి యువజన కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు.
Upwards and onwards – Unstoppable! pic.twitter.com/waZmOhv6dy
— Congress (@INCIndia) August 19, 2023
అనంతరం స్థానికులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. లద్దాఖ్‌లో రాహుల్ ఈ నెల 25 వరకు ఉంటారని తెలుస్తున్నది. కొన్ని ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్)లోనూ పోస్ట్ చేసిన రాహుల్.. ‘ఎగుడుదిగుడు ప్రయాణం.. అయినా ఆగదు’ అని వాటికి కామెంట్ పెట్టారు.
కేటీఎం 390 అడ్వంచర్ బైక్ 373 సీసీ బండి. దీని మాగ్జిమం బీహెచ్‌పీ 43, పీక్ టార్క్ 37 ఎన్.ఎం. దీని గరిష్ఠవేగం గంటకు 170 కి.మీ. తనకు కేటీఎం 390 బైక్ ఉన్నదని, కానీ దానిని నడిపేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని గతంలో రాహుల్ పేర్కొన్నారు.