దొరల తెలంగాణ పోవాలి.. ప్రజల తెలంగాణ రావాలి: రాహుల్ గాంధీ

తెలంగాణలో దొరల పాలన సాగుతోందని.. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ రావాలని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

  • Publish Date - November 25, 2023 / 12:13 PM IST
  • పదేళ్లలో కేసీఆర్ దోపిడీ చేసిన సొమ్మును కక్కిస్తాం
  • ఆదిలాబాద్ సభలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: తెలంగాణలో దొరల పాలన సాగుతోందని.. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ రావాలని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాడని విమర్శించారు.


ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజా విజయభేరి సభ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల నిరంకుశ పాలన కొనసాగుతున్నదని, దొరల పాలనకు చరమగీతం పాడి.. ప్రజల పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్నదన్నారు.


కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే తాము కన్న కలలు నెరవేరుతాయని ఆశించిన ప్రజలకు కేసీఆర్ మూలంగా నిరాశే మిగిలిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కోసం ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే, అమరుల ఆశయాలు నెరవేరడం లేదని పేర్కొన్నారు. వందలాదిమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణా ఏర్పడితే, లబ్ధి పొందింది మాత్రం కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కేవలం హామీలు కావని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మంత్రిమండలి సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం రూ.1200 ఉన్న గ్యాస్ సిలెండర్, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే రూ.500కే మహిళలకు ఇస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వివాహిత మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద రూ.2500, వృద్ధులకు రూ.4000 ప్రతినెలా పింఛను ఇస్తామని పేర్కొన్నారు.


తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆత్మహత్యలను చూడటానికి మా పార్టీ సిద్ధంగా లేదన్నారు. రైతులను ఆదుకుంటామని తెలిపారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.15000, రైతు కూలీలకు సంవత్సరానిక 12 వేలు, తెలంగాణా కోసం అమరులైన ప్రతి ఒక్కరి కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలాలు ఇస్తున్నట్లు తెలిపారు. యువ వికాసం కింద, విద్యా భరోసా కింద రూ.5 లక్షల సహాయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు చికిత్స ఖర్చులు చెల్లిస్తామని పేర్కొన్నారు.


బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం పార్టీలు ఒకటేనని, కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర.. ఇలా ఎక్కడైనా బీజేపీతో కాంగ్రెస్ పోరాటం చేస్తే, అక్కడ ఎంఐఎం అడ్డొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్, బీఆరెస్ మధ్యనే పోటీ ఉంటుందని, బీఆరెస్ కు వారి మిత్రులు బీజేపీ, ఎంఐఎం తెరవెనుక సహకరిస్తున్నారని ఆరోపించారు.


బీజేపీ ప్రభుత్వం నాపై అక్రమంగా 24 కేసులు నమోదు చేయించారని, నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసి, నా అధికారిక నివాసగృహాన్ని వెనక్కు తీస్కున్నారని తెలిపారు. అదే బీజేపీ, కేసీఆర్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పడమే తప్ప కేసీఆర్ పై కేసులేమైనా పెట్టారా? ఆయన అధికారగృహం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.