Site icon vidhaatha

ట్యాపింగ్‌ కేసులో అరెస్టులు షురూ.. తాజాగా ఇద్దరు ఏఎస్పీల అరెస్ట్‌

విధాత, హైదరాబాద్‌ : మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కీలక వ్యక్తిగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతున్నది. ప్రణీత్‌రావుతోపాటు ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఏఎస్పీలు.. ఆయనతో కలిసి పనిచేసిన భూపాలపల్లి అడిషననల్ ఎస్పీ భుజంగరావు, ఏఎస్పీ తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో విచారిస్తున్న పోలీసులు కేసు పురోగతిలో భాగంగా కీలక విషయాలు రాబడుతున్నారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు టీమ్‌లో ఎస్‌ఐబీ డీఎస్పీగా తిరుపతన్న, భుజంగరావు పనిచేశారు. ఎస్‌ఐబీ పొలిటికల్ వింగ్‌లో భుజంగరావు కీలక బాధ్యలు నిర్వహించారు. విచారణలో ప్రణీత్‌రావు వెల్లడించిన సమాచారం వారిద్దరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దానితో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు రాగానే వారిని ప్రశ్నించి, అదుపులోకి తీసుకున్నారు.

కొనసాగుతున్న సోదాలు

శనివారం రోజంతా ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇంటితోపాటు భుజంగరావు, తిరుపతన్నల నివాసాలు సహా మొత్తం 10 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌ ఇప్పటికే హైదరాబాద్‌ వదిలి అమెరికా, లండన్‌ వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఇక ఇదే కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చానల్‌ ఎండీ శ్రవణ్‌ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు ట్యాబ్‌లు, ఐదు పెన్‌ డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్‌రావు తనకు నమ్మకస్తులైన అధికారులతో ప్రైవేటు నిఘా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ట్యాపింగ్ కేసులో ఓ మాజీ డీజీపీ ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌ రావు కస్టడీ శనివారంతో ముగియనుండగా, ఆయనను ఆదివారం జడ్జి ముందు హాజరుపరుచనున్నారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ప్రత్యేక పెన్‌డ్రైవ్‌, హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచిన ప్రణీత్‌రావు.. ప్రభుత్వం మారగానే వాటిని ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసిన పరికరాలను, పెన్‌డ్రైవ్‌, హార్డ్‌డిస్క్‌లను మూసీ నదిలో, వికారాబాద్‌ అడవుల్లో విసిరేశాడు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాలింపు నిర్వహించారు. ప్రణీత్‌రావు ఫోన్లలో సమాచారాన్ని రిట్రైవ్‌ చేశారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం మేరకు విచారణ ముందుకు దూకిస్తున్నారు. ప్రణీత్‌రావు తన విచారణలో ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లుగా వెల్లడించాడు.

బ్లాక్ మెయిలింగ్‌తో వందల కోట్ల వసూళ్లు

అప్పటి బీఆరెస్ పార్టీ కీలక నేతల కోసం మొదలుపెట్టిన ఫోన్ ట్యాపింగ్‌ను దుర్వినియోగం చేసి బ్లాక్ మెయిలింగ్ దందాగా మార్చుకుని వందలకోట్లు ప్రభాకర్‌రావు వసూలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా ముసుగులో అప్పటి అధికార బీఆరెస్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల, సొంత పార్టీ నేతల ఫోన్లను ప్రభాకర్‌రావు టీమ్ ట్యాప్ చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తక్కువ సమయం ట్యాపింగ్ టెక్నిక్‌తో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని గుర్తించారు. రష్యా, ఇజ్రాయెల్ దేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసిన ప్రభాకర్‌రావు టీమ్.. వాటిని ఓ మొబైల్‌ వ్యాన్‌లో అమర్చుకుని ట్యాపింగ్ చేయాల్సిన నాయకులు, వ్యాపారుల ఇళ్ల సమీపంలో వ్యాన్‌ను నిలిపి.. వారి ఫోన్లను ట్యాప్‌ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. అప్పటి విపక్ష నేత, సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర ప్రతిపక్ష నేతలతోపాటు వ్యాపారుల ఫోన్లను కూడా ప్రభాకర్‌రావు టీమ్ ట్యాప్‌ చేసిందని, 30మందికి పైగా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు వసూలు చేశారని విచారణలో తేలిందని సమాచారం.

Exit mobile version