పలువురు గల్లంతు..రూ.400కోట్లకు పైగా నష్టం
విధాత : హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 63 మంది మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. మృతులలో మండి జిల్లా నుంచి 17 మంది, కాంగ్రాలో 13 మంది, చంబాలో ఆరుగురు, సిమ్లాలో ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. వరద బీభత్సం మండిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి తునాగ్, బాగ్సాయెద్‌లో పెద్దఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ.400 కోట్లు నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ అధికారులు పేర్కొన్నారు.
వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఇక, పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో అనేక ప్రాంతాల్లోని వేల మంది ప్రజలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు కూడా విరిగిపడుతుండటం మరింత సమస్యగా మారింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వంతెనలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వరదల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం ఆ రాష్ట్ర ప్రజలను మరింత కలవరపెడుతోంది.