Ramagundem | కందులకు కవిత ఆశీస్సులు?.. ఎవరు గెలిచినా తమ వారే

Ramagundem | రామగుండంలో గత ఎన్నికల పరిస్థితులే పునరావృతం విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికలనాటి పరిస్థితులే పునరావృతం అవుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పార్టీ టికెట్ కట్టబెట్టింది. టికెట్ల కేటాయింపునకు ముందు కనిపించిన అసమ్మతి జ్వాలలు కాస్త సద్దుమణిగినట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే అసమ్మతినేతలు ప్రస్తుత అభ్యర్థికి అనుకూలంగా పనిచేస్తారా అనే భయం అధికార పార్టీని వెన్నాడుతోంది. దీంతో గత ఎన్నికల్లో […]

  • Publish Date - September 2, 2023 / 12:08 AM IST

Ramagundem |

  • రామగుండంలో గత ఎన్నికల పరిస్థితులే పునరావృతం

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికలనాటి పరిస్థితులే పునరావృతం అవుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పార్టీ టికెట్ కట్టబెట్టింది. టికెట్ల కేటాయింపునకు ముందు కనిపించిన అసమ్మతి జ్వాలలు కాస్త సద్దుమణిగినట్టుగానే కనిపిస్తున్నాయి.

అయితే అసమ్మతినేతలు ప్రస్తుత అభ్యర్థికి అనుకూలంగా పనిచేస్తారా అనే భయం అధికార పార్టీని వెన్నాడుతోంది. దీంతో గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఈసారి ఇక్కడ అమలు చేయాలని అధికార పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరు ఏ పార్టీలో గెలిచినా, ఆ తరువాత తమ పార్టీలోకి వస్తే చాలు అనే విధానం బీఆర్ఎస్ గత రెండు ఎన్నికల్లోను అమలు చేసింది.

పార్టీ అధికారిక అభ్యర్థులు ఉన్న చోట్ల కూడా ప్రత్యర్థి బలవంతులైతే వారికి పరోక్ష సహకారం ఇచ్చింది. గత ఎన్నికల్లో రామగుండం నుండి అధికార పార్టీ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ పోటీ చేశారు. అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకంటి చందర్ కు సానుభూతి పవనాలు ఉన్నాయని గుర్తించిన బీఆర్ఎస్ లోపాయికారిగా ఆయనకు సహకరించిందనే వాదనలు ఉన్నాయి.

ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సోమారపు సత్యనారాయణ స్వయంగా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా గెలుపొందిన చందర్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లోను అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందనే భావన వ్యక్తం అవుతోంది.

అసమ్మతే అసలు సమస్య

అధికార పార్టీకి చెందిన కీలక నేతలు కందుల సంధ్యారాణి, కొంకటి లక్ష్మీనారాయణ, మిరియాల రాజిరెడ్డి, పాతపెల్లి ఎల్లయ్య, తదితరులు సిటింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రలు నిర్వహించారు. అధికార పార్టీలోనే ఉంటూ శాసనసభ్యునిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తమలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయించినా పర్వాలేదు అనే డిమాండ్ పార్టీ అధిష్టానం ముందు ఉంచారు.

అయినప్పటికీ వారి కల నెరవేరలేదు. మంత్రి కే తారకరామారావు జోక్యంతో ప్రస్తుతానికి అసమ్మతి నేతలు మౌనంగా ఉంటున్నా, ఎన్నికల్లో ఆయనకు సహకరిస్తారనే నమ్మకం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని గుర్తించిన అధికార పార్టీ అటు శాసనసభ్యుడికి గుర్తింపు ఇచ్చినట్టే చేస్తూ, ఇటు అసమ్మతి నేతల్లో ఒకరికి పరోక్ష మద్దతు ఇవ్వడానికి సిద్ధమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

జడ్పీటీసీకే పరోక్ష మద్దతు?

అసమ్మతి నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జడ్పీటీసీ కందుల సంధ్యారాణి రాఖీ పౌర్ణమి సందర్భంగా కార్మిక సంఘాల నేతలు, కార్మికులకు రాఖీలు కట్టి వారితో సోదర బంధం పెంచుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా కానీ, ఈ ప్రాంత ఓటర్లకు సుపరిచితమైన ఆల్ ఇండియా ఫార్మర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై గాని పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రముఖ కార్మిక క్షేత్రమైన రామగుండం నియోజకవర్గాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేని అధికార పార్టీ ఆ మేరకు సంధ్యారాణికి పరోక్ష మద్దతు పలకవచ్చని తెలుస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలైన కల్వకుంట్ల కవిత ఈ మేరకు సంధ్యారాణికి తన ఆశీస్సులు అందజేసినట్లు సమాచారం. అటు శాసనసభ్యునికి, ఇటు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా తన పని తాను చక్క పెట్టుకోవాలని సంధ్యారాణికి సూచించినట్టు సమాచారం.

Latest News