Site icon vidhaatha

Rappa Rappa: సూర్యాపేటను తాకిన “రప్పా రప్పా” డైలాగ్ సెగలు !

విధాత : పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన  “గంగమ్మ జాతరలో  వేట తలలు నరికినట్లుగా రప్పా రప్పా నరుకుడే” డైలాగ్ సెగలు ఏపీ రాజకీయాల్లో నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి పాకింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ తో ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ కు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్లుగా రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని..అంటూ ఫ్లెక్సీలో తన ఉన్మాదాన్ని ప్రదర్శించాడు రవితేజా అనే యువకుడు. దీనిపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం రప్పా రప్పా ఫ్లెక్సీ హింసను ప్రేరేపించేలా ఉందంటూ దానిని ఏర్పాటు చేసిన యువకుడిపై కేసులు పెట్టి రిమాండ్ చేసింది. ఈ ఫ్లెక్సీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో మాటలు మంటలు రేగిస్తుంది. ఇది ఇలా ఉండగానే “రప్పా రప్పా” డైలాగ్ సెగలు తెలంగాణకు కూడా విస్తరించాయి.

తొలుత బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరైన సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన రైతు మహా ధర్నాలో “2028 లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరుసటి రోజు ఆదివారం సూర్యాపేటలో సైతం “2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

“తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రప్పా రప్పా 3.0లోడింగ్..ఫ్రం సూర్యాపేట..స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలు..2028అసెంబ్లీ ఎన్నికల వరకు సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టడానికి “జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ” అంటూ తమ ఉత్సాహం చాటుకున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్, నిన్న సిద్దిపేట, నేడు సూర్యాపేటలలో “2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు మునుముందు తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేటట్లుగా కనిపిస్తున్నాయి.

Exit mobile version