Site icon vidhaatha

AP Politics : ఏపీ రాజకీయాల్లో ‘రప్పా రప్పా’ డైలాగ్ దుమారం: పవన్ కళ్యాణ్ సీరియస్

అమరావతి : ఇటీవల పుష్ప 2 సినిమాలోని రప్పా రప్పా  నరుకుతాం డైలాగ్‌తో వైఎస్.జగన్ ఫ్లెక్సీ చేసిన యువకుడిని అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ మండిపడ్డారు. అంతకుముందు ఫ్లెక్సీలపై సినిమా డైలాగులు రాస్తే తప్పేంటంటూ.. యువకుడి అరెస్టుని వైఎస్ జగన్ ఖండించారు. జగన్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే క్రిమినల్స్ తాట తీస్తామంటూ హెచ్చరించారు. నరకండి.. చంపండి.. పొడిచేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడిని ఈ దేశంలో ఎక్కడా చూడలేదంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఈ తరహా రాజకీయాలను, హింసోన్మాద వ్యాఖ్యలను, చర్యలను ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. సినిమా డైలాగులు థియేటర్ల వరకే బాగుంటాయని.. ప్రజాస్వామ్యంలో అనుసరించడం సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని.. బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాల్సి ఉందన్నారు. కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దు’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అయితే పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా గతంలో పవన్ ఎమ్మెల్యేల తోలు తీస్తా, చూసుకుందాం అని చేసిన వ్యాఖ్యల సంగతేంటి? అని వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.

Exit mobile version