విధాత: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ బేలా ఎం.త్రివేదీతో కూడిన మహిళా న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సీజేఐ డీ.వై. చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. మహిళా న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు కావటం సుప్రీం కోర్టు చరిత్రలో ఇది మూడోసారి.
మొదటి సారి 2013లో జి.జ్ఞానసుధా మిశ్ర, జస్టిస్ రంజనాప్రసాద్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. మహిళల హక్కులు, సమస్యలకు సంబంధించిన కేసుల పరిష్కారాన్ని వీరు చేపట్టారు. 2018లో జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం విధులు నిర్వహించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27మంది న్యాయమూర్తులుండగా వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 31న జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది ఒకే సారి సుప్రీం జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు.
వీరిలో జస్టిస్ బి.వి. నాగరత్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే.. దేశ చరిత్రలోనే ఓ మహిళా న్యాయమూర్తి సీజేఐ కావటంగా చారిత్రాత్మకం కానున్నది.