తిరుమల.. యాదాద్రిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, యాదాద్రిలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు.

  • Publish Date - February 16, 2024 / 07:17 AM IST

విధాత: ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, యాదాద్రిలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. అనంతరం చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంపై స్వామివారిని తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. రథసప్తమి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం శ్రీవారికి చక్రస్నానం, అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించారు.


రథసప్తమి వేడుకల సందర్భంగా ఆలయ మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. ఇటు తెలంగాణ ప్రసిద్ద పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అంలకరణ చేసి తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణ చేసి భక్తులకు రథ సప్తమి విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారిని బంగారు రథంపై ఊరేగించారు.

ఇక స్వామి వారి అధ్యయనోత్సవాల్లో భాగంగా తిరుమంజన మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను అలంకరించి పురప్పాట్టు శేవ ఊరేగింపు నిర్వహించారు. అరసవెల్లి శ్రీ సూర్యానారయణ స్వామి దేవాలయంలోనూ రథ సప్తమి వేడుకలు ఘనంగా సాగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో క్యూలెన్లు కిక్కిరిశాయి.

Latest News