వరంగల్: ఘ‌నంగా శివాలయ పున:ప్రతిష్టాపనోత్సవాలు

పర్వతగిరి శివాలయంలో మారుమోగుతున్న శివనామ స్మరణ  మహా లింగార్చనలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు, గ్రామస్తులు 28న గులాబీ నాయకుల జాతర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చారిత్రక ప్రాశస్త్యం, కాకతీయుల కళా వైభవ వారసత్వంతో విలసిల్లన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి శివాలయంలో పునః ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా శివ నామ స్మరణతో మారు మోగుతోంది. 28వ తేదీన పర్వతగిరి రాజకీయ జాతరను తలపించనున్నది. మంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, […]

  • Publish Date - January 27, 2023 / 12:52 PM IST
  • పర్వతగిరి శివాలయంలో మారుమోగుతున్న శివనామ స్మరణ
  • మహా లింగార్చనలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు, గ్రామస్తులు
  • 28న గులాబీ నాయకుల జాతర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చారిత్రక ప్రాశస్త్యం, కాకతీయుల కళా వైభవ వారసత్వంతో విలసిల్లన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి శివాలయంలో పునః ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా శివ నామ స్మరణతో మారు మోగుతోంది. 28వ తేదీన పర్వతగిరి రాజకీయ జాతరను తలపించనున్నది.

మంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొననున్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దయాకర్ రావు స్వగ్రామంలో ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలు జాతరను తలపిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహకారంతో ఉత్సవ నిర్వహణ కమిటీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల సందర్భంగా పర్వతగిరి శివాలయం పున: వైభవాన్ని సంతరించుకుంటోంది.

గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైన తెలంగాణ ప్రాంతం, సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురికాగా… తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ సంప్రదాయాలు, చరిత్ర, కళలు, కట్టడాలు మళ్లీ వికసిస్తున్నాయి. భావితరాలకు వారసత్వ విలువలను తెలియజేస్తున్నాయి.

ఈ కోవలోనే వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో 800 ఏళ్లనాటి పర్వతాల శివాలయం స్థానికులైన ఎర్రబెల్లి రామ్మోహన్ రావు చొరవ, మంత్రి ఎర్రబెల్లి ప్రోత్సాహంతో పున: ప్రతిష్ట చేసుకుంటోంది.

పర్వతాల మధ్య కొలువైన శివయ్యకు శుక్రవారం పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పూజలు వేకువజామునే ప్రారంభం అయ్యాయి. ఉదయం మహాలింగార్చన, పంచామృత అభిషేక కార్యక్రమాలతో, పవిత్ర శివనామస్మరణతో పర్వతగిరి పరిసరాలన్నీ మంత్రజపాలతో మారుమోగాయి.

మంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు మహాలింగార్చన, పంచామృత అభిషేకాల్లో పాల్గొని శివార్చన చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు మేలుకొలుపుతో ప్రారంభమైన పరమేశ్వరుని పూజలు రాత్రి 8 గంటలకు ధ్యానదివాసంతో ముగుస్తాయి.

28వ తేదీ ఉదయం మళ్లీ మేలుకొలుపుతో ప్రారంభమయ్యే పరమశివుని పూజా కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.