విధాత ప్రత్యేకం: కేంద్రంలోని ఇండియా, ఎన్డీఏ కూటములకు వ్యతిరేకంగా కిసాన్ కూటమిని నిర్మిస్తామని బీరాలు పలికిన బీఆర్‌ఎస్ అధినేత ఓటమి తర్వాత రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలను సీరియస్‌గా తీసుకోవడం లేదా? ఈ ఎన్నికలు ఇండియా, ఎన్డీఏ కూటమి కనుక తమకు అవసరం లేదనుకుంటున్నారా? బీఆర్‌ఎస్ బీఫాంపై పోటీ చేయడానికి నేతలు నిరాకరిస్తున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడానికి కారణమేంటి? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కాదని బీజేపీలోకి బీఆర్‌ఎస్ నేతలు క్యూ కట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? వాటిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇవే అంశాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
ఆత్మరక్షణలో కేసీఆర్?
కేసీఆర్ ఆత్మరక్షణలో ఉన్నారని, అందుకే ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ముఖ్యనేతలు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా.. వారికి అపాయింట్‌మెంట్ దొరకడం లేదనే చర్చ కూడా నడుస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్‌కు మేడిగడ్డ కుంగుబాబు అంశంలో విచారణ పెను సవాలుగా నిలువనున్నది. ఈ అంశంలో ఎట్టిపరిస్థితిలో ఆయనను చట్టం ముందు దోషిగా నిలబట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికితోడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ టార్గెట్ చేసుకుని ఉన్నది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదం ముందుకు వచ్చింది. వీటినుంచి తప్పించుకోవాలంటే బీజేపీ రక్షణ కోరడం మినహా కేసీఆర్‌కు మరో మార్గం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్‌ను కాదని బీఆరెస్ సిటింగ్ ఎంపీలు విచిత్రంగా బీజేపీలో చేరుతున్నారు. నిజానికి రానున్న ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది.
అయినా.. వారంతా బీజేపీకి మొగ్గు చూపుతుండటం వెనుక కారణమేంటన్న చర్చ జరుగుతున్నది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. అందులో కీలక పక్షంగా ఉండే కాంగ్రెస్.. కేసీఆర్‌పై దాడిని తీవ్రతరం చేసే అవకాశాలు ఉంటాయి. అదే బీజేపీ అధికారంలోకి వస్తే.. కొంతలో కొంత తనకు సేఫ్‌గా ఉంటుందనే భావన కూడా కేసీఆర్‌కు ఉండి ఉండొచ్చని అంటున్నారు. ఈ రెండింటిని కలిపి చూస్తే బీఆరెస్ ఎంపీలు బీజేపీలో చేరడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉన్నదో అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీలోకి మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు
బీఆరెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీఆరెస్ మహబూబాబాద్, అదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాంనాయక్, గోడెం నగేశ్, హుజూర్‌నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, పెద్దపల్లికి చెందిన గోమాస శ్రీనివాస్ ఆదివారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారికి తరుణ్‌చుగ్ పార్టీ సభ్యత్వాన్ని అందించి, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే బీఆరెస్ నుంచి నాగర్‌కర్నూల్ సిటింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడికి వెంటనే ఆయన స్థానంలో అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే జహీరాబాద్ సిటింగ్ ఎంపీ బీబీ పాటిల్ చేరిన వెంటనే టికెట్ కేటాయించారు. అలాగే బీఆరెస్‌కు చెందిన వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, పెద్దపల్లి నుంచి గాయకుడు మిట్టపల్లి సురేందర్ సైతం బీజేపీలో చేరితే వారికి ఆ స్థానాల్లో టికెట్లు దక్కవచ్చని తెలుస్తుంది.
లోక్‌సభ సమరానికి కాంగ్రెస్, బీజేపీ సై!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ దూకుడు పెంచాయి. బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకత్వం లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూనే.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేస్తూ ప్రజాప్రభుత్వ పనితీరును ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి సభలోనూ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ, బీఆరెస్ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టు వ్యవహరిస్తున్నాయని కూడా విమర్శిస్తున్నారు. కానీ.. గులాబీ దళపతి కేసీఆర్ మాత్రం.. ఇంకా జనం మధ్యలోకి రాకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
నల్లగొండ సభతో సరి!
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి అనంతరం ఫాంహౌస్‌లో జరిగిన ప్రమాదంలో బీఆరెస్ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగింది. దానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన.. కొద్దివారాలు విశ్రాంతి తీసుకుంటారని వైద్యులు ప్రకటించారు. కొంతకాలానికి అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్.. సభకుగానీ, ప్రజల్లోకి గానీ రాలేదు. ఫిబ్రవరి నెలలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. కానీ కృష్ణా నదిపై నిర్మించిన తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని ఆరోపిస్తూ నల్లగొండలో బీఆరెస్ ఏర్పాటు చేసిన సభకు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఏ సభలోనూ ఆయన పాల్గొనలేదు. పార్టీ ఓటమిపై అధినేత సమీక్షిస్తారనుకున్నా.. కేటీఆర్, హరీశ్ ఆయా సమావేశాలకు హాజరయ్యారు. కనీసం లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల నియోజకవర్గ స్థాయి సమావేశాలైనా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పెట్టలేదు. వారిని హైదరాబాద్‌కే పిలిపించుకుని బీఆర్‌ఎస్ భవన్ కేంద్రంగా సమీక్షించి.. నాలుగు స్థానాలకు (కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం) అభ్యర్థులను ప్రకటించారు.
కాంగ్రెస్ వస్తే కష్టమనే?
బీజేపీ తమ అభ్యర్థులుగా బీఆర్‌ఎస్ నేతలవైపే చూస్తున్నదా? దానికి పరోక్షంగా కేసీఆర్ సహకరిస్తున్నారా? అనే సందేహాలు కలిగేలా బీజేపీలో చేరికలుండటం గమనార్హం. బీఆరెస్ గెలువకున్నా ఇక్కడ కాంగ్రెస్ గెలువకూడదనే అభిప్రాయం కేటీఆర్‌తో పాటు మరికొంతమంది నేతల వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది. వాళ్లు బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ పాలనపైనే ఎక్కుపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతల విమర్శలు కూడా బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలకు దగ్గరగానే ఉంటున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నేతల విమర్శలకు బలం చేకూర్చేలా రాజకీయ పరిణామాలుండటం గమనార్హం.
ఆరోపణలపై చర్యలు లేవు.. కానీ..
కాళేశ్వరం విషయంలో మేడిగడ్డ కుంగుబాటు, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. కానీ కేంద్రం కేసీఆర్ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని రేవంత్ ప్రతీ సభలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే ప్రధాని ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అన్న వాదనను పక్కదోవ పట్టించడానికి కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కాదని బీఆర్‌ఎస్ నేతలు బీజేపీకి క్యూ కట్టడం, ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తుండటం వెనుక ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలను పెద్దగా సీరియస్‌గా తీసుకోకుండా, సిట్టింగ్ ఎంపీలతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తుండటంపై కేసీఆర్ మౌనం.. అర్ధాంగీకారమే అనే వాదన కూడా వినిపిస్తున్నది.