విధాత: ఖమ్మంలో లక్షల మందితో బిఆర్ ఎస్ సభ పెట్టుకోవడానికి అడ్డురాని కరోనా సమస్య రాష్ట్రంలో గణతంత్ర ఉత్సవాలకు ఎందుకు? అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశ్నించారు. కరోనా సాకుతో ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించలేదని పుదుచ్చేరిలో వ్యాఖ్యానించారు.
గురువారం ఉదయం హైదరాబాద్ రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడూతూ తెలంగాణ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు.
రాజ్యాంగాన్ని గౌరవించని తెలంగాణ ప్రభుత్వం..
ఖమ్మం పట్టణంలో 5 లక్షల మందితో సభ నిర్వహించారని, ఆ సభకు లేని అడ్డంకులు గణతంత్ర వేడుకలకే వచ్చాయా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి రిపోర్ట్ పంపించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో గణతంత్ర వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
రెండేండ్లుగా నిర్వహణకు నోచుకోని వేడుకలు..
రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో రెండు సంవత్సరాలుగా గణతంత్ర వేడుకలు నిర్వహించడం లేదు. కానీ ఇదే కాలంలో రాజకీయ సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తాజాగా ఫిబ్రవరి 17వ తేదీన కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మరో భారీ సభ నిర్వహించడానికి భారత్ రాష్ట్ర సమితి ఏర్పాట్లు చేస్తున్నది.
సభల నిర్వహణపై వెల్లువెత్తుతున్న విమర్శలు
రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించకుండా రాజకీయ సభలను నిర్వహించడం పట్ల విమర్శలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకొని పరేడ్ తో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశించినా..
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహిస్తుందని అందరూ భావించారు. అధికారులు కూడా ముఖ్యమంత్రి నుంచి వచ్చే ఆదేశాల కోసం అర్ధరాత్రి వరకు వేచి చూశారు. కానీ ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో తిరిగి వెళ్లి పోయారు. దాంతో అధికారులు రాజ్‌భవన్‌లోనే పరేడ్ నిర్వహించారు.
గవర్నర్‌తో ఉన్న విభేదాల కారణంగానే గత రెండేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేశారని అంటున్నారు.
అప్పటి నుంచే విబేధాలు ఆరంభం..
పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించేందుకు ఉద్దేశించిన ఫైల్‌ను గవర్నర్ తన దగ్గర అట్టి పెట్టుకోవడం తర్వాత నుంచి రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య విబేధాలు మొదలయ్యాయి. గవర్నర్ తరచూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో అవి మరింత ముదిరాయి. ఆ తరువాత అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను కూడా గవర్నర్ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంచారు.
పెరిగిన మరింత గ్యాప్
దీంతో రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మరింతగా పెరిగి పోయింది. దీనికి పరాకాష్టగా రాబోయే అసెంబ్లీ సమావేశాలను కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో గణతంత్ర ఉత్సవాలు కూడా గవర్నర్, సీఎం మధ్య అగాథాన్ని పెంచాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.