న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జాతీయ మీడియా ఎన్డీటీవీతో రాహుల్ వెల్లడించినట్లు ఆ టీవీ చానెల్ వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు. సీఎం రేవంత్ అనే అంశంపై నిర్ణయం జరిగిందని రాహుల్ అన్నట్లు పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో సీఎంగా రేవంత్‌నే ఫైనల్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరై తెలంగాణ సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ రాత్రికి హైదరబాద్‌లో సీఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసి, ఈ విషయాన్ని డీకే శివకుమార్ అధికారికంగా వెల్లడించనున్నారు. డీకే శివకుమార్ సాయంత్రం వరకు హైదరాబాద్‌కు రానున్నారు. ఖర్గేతో భేటీకి ముందు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రే వేర్వేరుగా చర్చలు జరిపారు.
చివరి నిమిషంలో అసమ్మతి
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. సహజంగానే ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. అయితే.. చివరి నిమిషంలో ఆయన ఎంపికపై అసమ్మతి చెలరేగడంతో సోమవారం రాత్రి జరగాల్సిన ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రధానంగా రేవంత్‌రెడ్డికి సీఎం పదవి అప్పగించడాన్ని వ్యతిరేకించారని ప్రచారం జరిగింది. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి సీటులో పార్టీ పేలవ ప్రదర్శన, రేవంత్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసువంటివి చూపుతూ వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని సమాచారం.
పార్టీ పగ్గాలు ఇచ్చినప్పుడూ వ్యతిరేకత
రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించినప్పుడు కూడా సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానానికి కోట్లకొద్దీ డబ్బులిచ్చి ఆ పదవి పొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నా.. సాధించింది తామేనన్న అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లడంలో బీఆరెస్ సఫలమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభావం దారుణంగా క్షీణించింది. కానీ రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆరెస్‌కు ప్రధాన ప్రత్యర్థి స్థాయికి, అనంతరం అధికారంలోకి కాంగ్రెస్‌ను తీసుకెళ్లారు. ఎన్నికల ముందు కూడా టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలనుంచే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలంటే తనకు మద్దతు పలికే ఎమ్మెల్యేలే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన టికెట్ల విషయంలో తను అనుకున్న పనిచేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన మొత్తం 64 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది రేవంత్ వర్గీయులేనని చెబుతున్నారు. దానితో అసలే మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిన కాంగ్రెస్.. గెలిచిన ఒక్క రాష్ట్రంలో తిరుగుబాట్లకు అవకాశం ఇవ్వకూడదని భావించి.. రేవంత్‌రెడ్డికే మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది.