ఇందిరమ్మ ఇళ్లు లేని ఊర్లో మేం ఓట్లు అడగం.. డబుల్‌ ఇళ్లు ఇవ్వని ఊర్లో మీరు అడగొద్దు: కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వని ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు.. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊర్లో మేం ఓట్లు అడగం.. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లు దౌల్తాబాద్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు విధాత: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊర్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగదని, ఏ ఊర్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదో ఆ ఊర్లో మీరు […]

  • Publish Date - January 27, 2023 / 11:10 AM IST
  • డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వని ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు..
  • ఇందిరమ్మ ఇళ్లు లేని ఊర్లో మేం ఓట్లు అడగం..
  • కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లు
  • దౌల్తాబాద్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు

విధాత: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊర్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగదని, ఏ ఊర్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగవద్దు.. ఈ సవాల్‌కు మీరు సిద్ధమా? అని మంత్రి కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. శుక్రవారం దౌల్తాబాద్‌ మండలానికి చెందిన పలువురు బీఆర్‌ ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు లేదో.. కాంగ్రెస్ ఆ ఊర్లో ఓటు అడగదు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా’’ అని అన్నారు.

దేశాన్ని ఏకతాటిపై తెచ్చేందుకే…

దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు చిచ్చు పెడుతున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశాన్ని ఏక తాటిపై తెచ్చేందుకే రాహుగాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతి గుండెకు, ప్రతి ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచ్చిందని చెప్పారు. ఇంటింటికీ కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నేను.. మీరు నాటిన మొక్క

‘మీరు నాటిన మొక్క కొడంగల్‌కు గుర్తింపు తెచ్చింది. 2009 కంటే ముందు కొడంగల్ లో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. మీరు కష్టపడి నాటిన మొక్క.. ఒక వృక్షమై కొడంగల్‌కు ఒక గుర్తింపు తీసుకొచ్చింది వాస్తవం కాదా ఆలోచించండి’ అని కోరారు. రావులపల్లి, మద్దూరు, కోయిల్ కొండ కు డబుల్ రోడ్డు తీసుకొచ్చామన్నారు. కృష్ణా జలాలు తెస్తామని చెప్పిన వాళ్లు.. కనీసం దౌల్తాబాద్ చెరువు తూము మూతపడితే తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప .. ఈ ఐదేండ్లలో కొడంగల్కు బీఆర్ఎస్ చేసిందేంటని ప్రశ్నించారు.

బీఫామ్‌పై సంతకాలు పెట్టే అవకాశం ఇచ్చిన సోనియా

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ 119 నియోజకవర్గాల బీ ఫామ్ పై సంతకం పెట్టే అవకాశం మనకు ఇచ్చారని రేవంత్‌ అన్నారు. మన ఓటు మనం వేసుకుంటే.. ఎవరి దగ్గరా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉండదన్నారు. మన ఊర్లలో రైలు కూత వినిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

నాపై కోపంతో నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ పక్కన పెట్టిండు

తనపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్ కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కొడంగల్ ప్రజలకు తనకు చేతనైన సాయం చేశానని, కానీ ఏ ఒక్కరి దగ్గరా చేయి చాచలేదన్నారు. తాను ఎవరి వద్దనైనా చేయి చాచినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

పంచాయితీలకు లంచాలు తీసుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కొడంగల్ లో పరిస్థితి పూర్తిగా మారిందని రేవంత్‌ అన్నారు. ఏ పంచాయితీ అయినా బీఆరెస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే దౌల్తాబాద్‌కు జూనియర్ కాలేజీ తీసుకొస్తా అని హరీష్ రావు అన్నాడని, మరి ఇప్పుడు కాలేజీ ఎందుకు తేలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళ్లు లేవా? అని హరీశ్‌ను నిల‌దీశారు. స్థానిక నాయకులందరూ ప్రతి ఇంటికీ తిరగాలని పిలుపు ఇచ్చారు. పాదయాత్రలో ఉన్నా ఇక్కడి సమాచారం తనకు తెలుస్తుందన్న రేవంత్‌ మన చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దన్నారు.