ఎయిర్‌ పోర్టు నుంచి వెనక్కి వెళ్లిన రేవంత్‌

ఢిల్లీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు ఎయిర్‌ పోర్టు చేరుకున్న తెలంగాణ సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా తిరిగి వెనక్కి వెళ్లారు

  • Publish Date - December 6, 2023 / 11:17 AM IST
  • హైకమాండ్‌ నుంచి ఆకస్మిక పిలుపు


విధాత : ఢిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నం హైద్రాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు ఎయిర్‌ పోర్టు చేరుకున్న పీసీసీ చీఫ్‌, తెలంగాణ సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా తిరిగి వెనక్కి వెళ్లారు. హైకమాండ్‌ పెద్దల పిలుపుతో ఆయన ఎయిర్‌ పోర్టు నుంచే మళ్లీ వెనక్కి వెళ్లి మహారాష్ట్ర సదన్‌కు వెళ్లారు. అంత అత్యవసరంగా ఎందుకు హైకమాండ్‌ రేవంత్‌ను వెనక్కి పిలిచారన్నదానిపై ఆసక్తి నెలకొంది.


మహారాష్ట్ర సదన్‌లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు థాక్రేతో భేటీ అయ్యారు. వారి భేటీలో మంత్రివర్గ కూర్పులో సీనియర్ల డిమాండ్లు, సూచనలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. రేవంత్‌ అంతకుముందే రేవంత్‌ తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. సీఎంగా తన పదవీ ప్రమాణా స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించారు.


ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌లను రేవంత్‌ కలిశారు. అనంతరం పలువురు ఏఐసీసీ నేతలను రేవంత్‌ కలిసి వారందరిని తన ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ పెద్దలతో తన మంత్రివర్గం కూర్పులో అనుసరించాల్సిన అంశాలపై కూడా రేవంత్‌ రెడ్డి చర్చించారు. అనంతరం ఆయన తిరిగి హైద్రాబాద్‌కు వెళ్లేందుకు ఎయిర్‌ పోర్టుకు చేరుకోగానే మళ్లీ హైకమాండ్‌ పిలుపుతో వెనక్కి వెళ్లారు.


మరోవైపు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రేవంత్‌ను సీఎం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాక ఆయన హైద్రాబాద్‌కు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఎల్బీస్టేడియంలో రేపు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణాస్వీకారోత్సవానికి కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది.