విధాత: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు రైతుబంధు సహాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించడం బీజేపీ-బీఆరెస్‌ల మధ్య బంధానికి నిదర్శనమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనే నవంబర్ 15లోపే రైతుబంధుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరినప్పటికి దాన్ని పరిగణలోకి తీసుకోలేదని రేవంత్ విమర్శించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు, బీఆరెస్‌కు మేలు చేసేందుకే పోలింగ్‌కు ముందు రైతుబంధుకు అనుమతించారని ఆరోపించారు. రైతుబంధుకు అనుమతి ద్వారా మోడీ-కేసీఆర్‌ల మధ్య ఫెవికాల్ బంధం బహిర్గతమైందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లను కొనుగోలు చేసేందుకు బీఆరెస్ ప్రయత్నిస్తుందన్నారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. బీఆరెస్ వేస్తున్న రైతుబందు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఏది ఇచ్చిన తీసుకోవాలని తాము అధికారంలోకి వచ్చాక రైతు బంధు డబ్బులు కేసీఆర్ కంటే ఐదు వేలు ఎక్కువే ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రైతుబంధు పంపిణీతో రైతులకు 5000 నష్టం వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిచాకా డిసెంబర్లో అయితే 15వేల రైతుబంధు అందుతుందని పేర్కోన్నారు. బీజేపీ-బీఆరెస్‌ల రాజకీయ కక్ష సాధింపు కుట్రలో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ, ఈడీ దాడులు చేస్తుందన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోనందుకే బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు పలువురు సీనియర్ నేతలు వచ్చారన్నారు. అంతమాత్రాన వారు బీజేపీలో ఉంటే మంచివారు, లేదంటే చెడ్డవారు అన్నట్లుగా కేంద్రం వ్యవహారించడం విచారకరమన్నారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి పదేళ్లుగా ఉండి కేసీఆర అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మంత్రి కేటీఆర్ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆరెస్ సలహాదారుడు ఏకే గోయల్ ఇంట్లో రూ.300 కోట్లు ఉంటే వాటిని వదిలేసి తమ నాయకులపై లారీ ఛార్జి చేశారని మండిపడ్డారు. నేతల ఫోన్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ లిఫ్ట్ చేయడం లేదని రేవంత్ ఆరోపించారు. తాను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు.