Revanth VS Uttam | రేవంత్ VS ఉత్తమ్‌.. ఇద్దరు నేతల మధ్య వాడీ వేడి చర్చ

Revanth VS Uttam క్లాస్‌ పీకిన కేసీ వేణుగోపాల్‌ మీకున్నది వంద రోజులే విభేదాలు వీడి కలిసి పని చేయండి కొట్లాడుకుంటా అంటే మీ ఇష్టం నేతలకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ పిలుపు తెలంగాణలో కర్ణాటక వ్యూహమే కేసీఆర్ భూస్కామ్‌పై చార్జిషీట్‌ పార్లమెంట్ స్థానాల వారిగా బహిరంగ సభలు తండాల్లో బసలు విధాత: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలోనే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల మధ్య వాడి వేడి […]

  • Publish Date - August 5, 2023 / 04:17 PM IST

Revanth VS Uttam

  • క్లాస్‌ పీకిన కేసీ వేణుగోపాల్‌
  • మీకున్నది వంద రోజులే
  • విభేదాలు వీడి కలిసి పని చేయండి
  • కొట్లాడుకుంటా అంటే మీ ఇష్టం
  • నేతలకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ పిలుపు
  • తెలంగాణలో కర్ణాటక వ్యూహమే
  • కేసీఆర్ భూస్కామ్‌పై చార్జిషీట్‌
  • పార్లమెంట్ స్థానాల వారిగా బహిరంగ సభలు
  • తండాల్లో బసలు

విధాత: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలోనే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ(పీఏసీ) జరిగింది. ఏఐసీసీనుంచి ముఖ్య అతిధిగా వచ్చిన కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు.

మండల కమిటీలలో ఏఅధికారంతో ఉత్తమ్‌ జోక్యం చేసుకుంటున్నారని రేవంత్‌ ఉత్తమ్‌ను ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా తానే మండల కమిటీలను ఎంపిక చేస్తానని రేవంత్‌ అన్నారు. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాలో చూసుకోవాలని కానీ మీకు పక్క జిల్లాల మండల కమిటీల్లో కూడా ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని అడిగారు.

దీనిపై తీవ్రంగా స్పంధించిన మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల్లో మాక్కూడ పాలోవర్స్‌ ఉన్నారు కదా… వాళ్లను రక్షించుకోవడం తమ బాధ్యత కదా? అని అడిగారు. కావాలని తమ ఫాలోవర్స్‌ను దెబ్బతీసేలా మండల కమిటీల్లో అవకాశాలు కల్పంచడంలేదని తీవ్ర స్థాయిలో రేవంత్‌పై ఉత్తమ్‌ మండి పడ్డారు. దీనికి కౌంటర్‌గా ఏ జిల్లా నాయకులు ఆ జిల్లా చూసుకుంటే గొడవ వుండదని రేవంత్‌ అన్నారు.

వెంటనే ఉత్తమ్‌ జోక్యం చేసుకొని మేము ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్నామని, మా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తుంటే ఎలా..? ఊరుకుంటామన్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మమ్మల్ని కలుపుకుని పోయే పనే చేయడం లేదన్న మాజీ చీఫ్ పీఏసీ సమావేశంలో కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు.

అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్న దామోదర

దామోదర రాజనర్సింహా జోక్యం చేసుకొని పాత పది జిల్లాల నాయకులను పిలిచి మాట్లడాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. మండల కమిటీ లలో అందరి అభిప్రాయాలు తీసుకుంటే నష్టం ఏమిటని దామోదర రాజనర్సింహ రేవంత్‌ను ప్రశ్నించారు.

క్లాస్‌ పీకిన కేసీ

నేతల పంచాయతీని స్వయంగా సూచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ నేతలకు క్లాస్‌ పీకారు. ఎన్నికలు సమీపించాయి.. మీకు ఉన్నది కేవలం 100 రోజులే సమయం మాత్రమే…కలిసి పని చేస్తారా లేక ఇలాగే కోట్లాడుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇంకా కొట్లాడుకుంటానంటే మీ ఇష్టం… నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు.. చెప్పింది విని చేస్తారా? లేదా..? తాను ఇక్కడి నుంచి వెళ్లిపోవాళా అని సీరియస్‌ అయ్యారు.

మీకు పిల్లలాటగా ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని లేదా? లేక ఇక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చి తాము మంత్రులం కాము కదా? మీరే మంత్రులు అవుతారు కదా? అని అడిగారు. మీకు సీఎం, మంత్రులు కావాలని ఉందా? లేదా అని నిలదీశారు. దీంతో నేతలంతా ఒక్కసారిగా కామ్‌ అయ్యారు.

వెంటనే ఒక నలుగురు నాయకులు మనసులో ఉన్నవి అన్నీ పక్కన పెట్టి ఈ వంద రోజులు కలిసి పని చేయండని ఆదేశించారు. మీరు కలిసి పని చేస్తే పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. వంద రోజులు కష్టపడండి… వచ్చే ఐదేళ్లు మీదే అధికారం అని కేసీ వేణుగోపాల్‌ నాయకులకు దిశానిర్దేశనం చేశారు.

తెలంగాణలో కర్ణాటక వ్యూహామే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార సాధనకు కర్ణాటక తరహా ఎన్నికల వ్యూహం అనుసరించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే.సి.వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మార్గదర్శకం చేశారు. బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లం, పార్టీ బలోపేతం, నియోజకవర్గాల వారిగా పార్టీ బలాబలాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయ సాధనకు వేణుగోపాల్ పలు సూచనలు చేశారు.

తెలంగాణలో భూముల స్కామ్ జరుగుతుందని, దీనిపై చార్జిషీట్ వేసి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. కర్ణాటక ప్రభుత్వం 33శాతం అవినీతి అంశం మాదిరిగానే కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎన్నికల ప్రచారంశంగా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ బలోపేతం దిశగా గిరిజన తండాల్లో పార్టీ నాయకులు బస చేయాలని వేణుగోపాల్ సూచించారు. ఆగస్టు 15నుంచి సెప్టెంబర్ 15 మధ్య నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని, అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సభలు నిర్వహించి ఎన్నికల ప్రచార అంశాలను ఉదృతం చేయాలన్నారు. జహీరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలు నిర్వహించాలన్నారు.

ఒక్కో బహిరంగ సభకు ఒక్కో ముఖ్య నేత హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికరావు ఠాక్రే, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, షబ్బీర్ అలీ పీఏసీ సభ్యులంతా పాల్గొన్నారు.

41 సీట్లలో పక్కా గెలుపు.. కాస్త కష్టపడితే మరో 42..

నివేదిక ఇచ్చిన సునీల్‌ కనుగోలు

రాష్ట్రంలోని 119నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. పార్టీ విజయావకాశాలపై ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ కు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తన టీమ్ సర్వే చేసి రూపొందించిన కీలక రిపోర్టును అందించారు.

ఈ నివేదికలో 119సీట్లను మూడు కేటగిరీలుగా సునీల్ విభజించారు. ఏ కేటరిరిలో 41స్థానాలు, బీ కేటగిరీలో 42స్థానాలు, సీ కేటగిరీలో 36స్థానాలున్నాయి. ఏ కేటగిరీలో 41స్థానాల్లో కాంగ్రెస్ గన్‌షాట్‌గా గెలుస్తుందని, బీ కేటగిరీలో కొంచెం కష్టపడితే గెలుపు సాధ్యమని, సీ కేటగిరిలో పార్టీ బలహీనంగా ఉందని, బీ కేటగిరీ సీట్లలో పార్టీ గెలిస్తేనే అధికారంలోకి వస్తుందన్నారు.

అందుకు బీ కేటగిరీ సీట్ల లో బలం పెంచుకోవాలని సూచించారు. ఈ నెలఖారులోగా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయనుందని పార్టీ వర్గాల సమాచారం.

Latest News