ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారి: మంత్రి పొంగులేటి

గత బీఆరెస్‌ ప్రభుత్వం పెద్దలు చేసే తప్పులు బయటకు లీక్‌ చేస్తారన్న భయంతోనే వీఆర్‌వో, వీఆర్‌ఏలను లేకుండా చేసి ధరణి తెచ్చి రెవెన్యూ వ్యవస్థను

  • Publish Date - January 29, 2024 / 06:16 AM IST
  • ఉద్యోగుల ఖాతాల్లో 5వ తారీకు లోపే జీతాలు

విధాత : గత బీఆరెస్‌ ప్రభుత్వం పెద్దలు చేసే తప్పులు బయటకు లీక్‌ చేస్తారన్న భయంతోనే వీఆర్‌వో, వీఆర్‌ఏలను లేకుండా చేసి ధరణి తెచ్చి రెవెన్యూ వ్యవస్థను విధ్వంసం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ల అవిష్కరణ కార్యక్రమంలో పొంగులేటి హాజరై డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గతంలో మాదిరిగా ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఉద్యోగస్తుడికి ఒకటో తేదీ నుంచి 5వ తేదీ లోపే జీతం అకౌంట్లల్లో పడేలా చూడటం ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తుల, ఉద్యోగుల స్వేచ్చను హరించారని పొంగులేటి ఆరోపించారు. సామాన్యుడే కాదు.. ఏ ఉద్యోగి కూడా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగులు, అధికారులు మంచిగా పనిచేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందన్నారు.


తమ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలు వీటిన్నిటికి చెక్కు పెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ధరణి పోర్టల్‌తో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. ధరణి ముసుగులో ప్రభుత్వ భూములను మాయం చేశారని, వివాదస్పద భూములను గత పాలకులు సొంతం చేసుకున్నారన్నారు. తమ ప్రభుత్వం ధరణిలో గత ప్రభుత్వ చేసిన తప్పులను ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, సెక్రటరీ జనరల్ రమేష్ రాథోడ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి, పద్మప్రియ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్సెంగ్ చౌహాన్, అరేటి రాజేశ్వర్, శ్రీనివాస్ శంకర్, పుష్యమి, ఎస్పీజర్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.