Rishabh Pant |
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న రిషబ్ పంత్ మరి కొద్ది నెలలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతూ వేగంగా ఫిట్‌నెస్ దక్కించుకుంటున్నాడు.
ఈ క్రమంలో వచ్చే ఏడాది భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులో ఉంటాడని సమాచారం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ సిరీస్ జనవరి నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తుండగా, ఈ సిరీస్ వరకు పంత్ ఫిట్ నెస్ పొందుతాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి చెప్పినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ తెలియజేసింది.
ప్రమాదంలో పంత్‌కి అయిన గాయాలన్నీ కూడా పూర్తిగా తగ్గినట్టు తెలుస్తుండగా, అన్నీ అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ప్రారంభంలో పంత్ తిరిగి భారత జట్టులోకి చేరనుండడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్ట్ జట్టులో సరైన వికెట్ కీపర్ లేక భారత జట్టు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
పంత్ తిరిగి జట్టులోకి వస్తే టీమిండియా జట్టు మరింత పటిష్టం కావడం ఖాయంగా కనిపిస్తుంది. టెస్ట్ అయిన వన్డే అయిన ఒకే స్టైల్‌లో ఆడుతూ వీక్షకులకి మంచి వినోదం పంచే రిషబ్ పంత్ జట్టుకు దూరంగా ఉండడం ఆయన అభిమానులని ఎంతగానో కలవరపరుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు రిషబ్ పంత్ కారులో వెళుతున్న క్రమంలో రూర్కీ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన పంత్ అద్దం పగలగొట్టుకుని కారు నుంచి బయటకు దూకేశాడు. ఆ సమయంలో అతడి తల, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గాయాల నుంచి దాదాపుగా కోలుకున్న పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతూ ఫిట్‌నెస్ పొందేందుకు ఎంతో కృషి చేస్తున్నాడు