టెస్లా ఫ్యాక్ట‌రీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై రోబో దాడి.. రెండేళ్ల త‌ర్వాత వెలుగులోకి!

ప‌రిశ్ర‌మ‌ల్లో రోబోల వాడ‌కంపై ఇప్ప‌టికీ భిన్నాభిప్రాయాలు విన‌ప‌డుతూనే ఉన్నాయి.

  • Publish Date - December 27, 2023 / 09:11 AM IST

విధాత‌: ప‌రిశ్ర‌మ‌ల్లో రోబో (Tesla) ల వాడ‌కంపై ఇప్ప‌టికీ భిన్నాభిప్రాయాలు విన‌ప‌డుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ‌నుషుల‌తో క‌లిసి ప‌ని చేసే ప్ర‌దేశాల్లో వాటి ప్ర‌వ‌ర్త‌న‌పై క‌న్నేసి ఉంచాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలాంటి వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చే ఘ‌ట‌న ఎలాన్ మ‌స్క్‌కు చెందిన టెస్లా ఫ్యాక్ట‌రీలో జ‌రిగింది. టెస్లాకు చెందిన ఆస్టిన్‌లోని గిగా టెక్సాస్ ఫ్యాక్ట‌రీలో.. ఒక ఇంజినీరుపై రోబో దాడి (Robot Attacks Employee) చేసింది.


ఈ ఘ‌ట‌న‌లో అత‌డికి తీవ్ర గాయాలై ఆ ప్ర‌దేశమంతా క‌ర్త‌సిక్తం అయిపోయిందని తెలిసింది. 2021 న‌వంబ‌రు 10న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టికీ ఈ వార్త రెండేళ్ల త‌ర్వాత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ట్రేవిస్ కౌంటీ, ఫెడ‌ర‌ల్ రెగ్యులేష‌న్‌ల‌కు ఆ సంస్థ స‌మ‌ర్పించిన నివేదిక‌లో ఈ వివ‌రాలు ఉన్నాయి. దాని ప్ర‌కారం.. అప్పుడే త‌యారైన అల్యూమినియం భాగాల‌ను కారు ఛాసిస్‌కు అనుసంధానించ‌డానికి ఒక రోబో ప‌నిచేస్తోంది.


ఒక రోజు అది హ‌ఠాత్తుగా ఒక అల్యూమినియం భాగాన్ని తీసుకుని.. పక్క‌నే మ‌రో రోబోకు ప్రోగ్రామింగ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ప‌డేసింది. దీంతో అత‌డి వెనుక భాగం, మోచేయిపై తీవ్ర‌గాయాల‌య్యాయి. అయితే ప‌ని నుంచి త‌ప్పుకొనే స్థాయిలో ఆ గాయాలు లేవ‌ని.. ఆ నివేదిక పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై టెస్లా కాంట్రాక్టు వ‌ర్క‌ర్ల త‌ర‌ఫు అటార్నీ జ‌న‌ర‌ల్ హ‌న్నా అలెగ్జాండ‌ర్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆ సంస్థ‌లో కార్మికుల‌కు జ‌రిగే అన్ని విష‌యాల‌నూ సంస్థ బ‌య‌ట‌పెట్ట‌ద‌ని.. చాలా వ‌ర‌కు బ‌య‌ట‌కు రానివ్వ‌ద‌ని ఆమె ఆరోపించారు.


ఆ లోప‌ల జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌ను ఈ త‌ర‌హా నివేదిక‌లు ప్ర‌తిబింబించ‌లేవ‌న్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా ఆమె 2021లో సంభ‌వించిన ఒక కార్మికుడి మ‌ర‌ణాన్ని గుర్తు చేశారు. ఆంటెలెమో ర‌మిరెజ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి టెస్లాలో అనుమానాస్ప‌దంగా మ‌ర‌ణించార‌ని.. కానీ అత‌డు అధిక ఉష్ణోగ్ర‌త బారిన ప‌డి మ‌ర‌ణించార‌ని రిపోర్టులో పేర్కొన్న‌ట్లు వెల్ల‌డించారు. 2000 ఎక‌రాల విస్తీర్ణంలో టెస్లా ఫ్యాక్ట‌రీ నిర్మించే క్ర‌మంలో అత‌డు అక్క‌డ ప‌ని చేస్తుండ‌గా చ‌నిపోయిన‌ట్లు పేర్కొన్నారు. టెస్లా రిపోర్టును అబ‌ద్ధం అనుకుని అనుమాన‌ప‌డుతూనే చ‌ద‌వాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


టెస్లా భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అనుమానాలు


టెస్లాలోని భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై విమ‌ర్శ‌లు రావ‌డం ఇదే తొలిసారి కాదు. మ‌రీ ముఖ్యంగా కాంట్రాక్టు, స‌బ్ కాంట్రాక్టు ఉద్యోగులకు స‌రైన వ‌స‌తులు ఉండ‌వ‌ని ప‌లు ఎన్జీఓలు ఎప్ప‌టి నుంచో పోరాడుతున్నాయి. వ‌ర్క‌ర్స్ డిఫెన్స్ ప్రాజెక్ట్ అనే స్వ‌చ్ఛంద సంస్థ గ‌తేడాది గిగా టెక్సాస్ సంస్థ‌పై యూఎస్ ఆక్యుపేష‌న‌ల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేష‌న్‌కు సైతం ఫిర్యాదు చేసింది.


ప్ర‌భుత్వ చ‌ర్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి సంస్థ‌లో జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌ను.. వ్య‌క్తిగ‌త ఆరోగ్య సమ‌స్య‌ల జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లుగా టెస్లా న‌మోదు చేస్తోంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక్క 2018లోనే సుమారు 36 మందికి గాయాల‌య్యాయ‌ని.. అవేమీ ప్ర‌భుత్వం దృష్టిలోకి రాలేద‌ని ఈ బృందం వెల్ల‌డించింది.