విధాత: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. గత ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 30న అత్యధికంగా రూ. 254 కోట్లు, 31న రూ.216 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా అబ్కారీ శాఖ ఆదాయాన్ని ఆర్జించింది.
గతేడాది డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయని అబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో రూ.70 నుంచి రూ.80 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగేవి. సెలవు దినాల్లో అయితే అది రూ.100కోట్ల వరకు సాగేవి.
కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో ఏకంగా రోజుకు రూ.185 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాల వేళలను ప్రభుత్వం పొడిగించింది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గం. వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు, సుమారుగా లక్షా 28వేల 455 కేసుల బీర్ కేసుల అమ్మకాలు జరగినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్ రెండు డిపోల నుంచే రూ.37 కోట్ల 68 లక్షల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ 1 డిపో-రూ.16కోట్ల 90 లక్షలు, హైదరాబాద్ 2 డిపో నుంచి రూ.20 కోట్ల 78 లక్షల ఆదాయం లభించింది.
ఏపీలోనూ జోష్
ఏపీలో న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 127 కోట్ల లిక్కర్ సేల్స్ జరుగగా, 29న రూ.72.3 కోట్ల అమ్మకాలు, 30న రూ.86 కోట్ల అమ్మకాలు జరిగాయి. అయితే సాధారణ రోజుల్లో రూ.72 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతుండేవి.