తెలంగాణ రాష్ట్ర నివాసిత మ‌హిళ‌ల‌కే ఉచిత ప్ర‌యాణం: స‌జ్జ‌నార్

మహాల‌క్ష్మి ప‌థ‌కం కింద ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు

  • Publish Date - December 8, 2023 / 12:29 PM IST

హైద‌రాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వం మహాల‌క్ష్మి ప‌థ‌కం కింద ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణాన్ని శ‌నివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల నుంచి అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర నివాసిత మ‌హిళ‌ల‌కే ఉచిత ప్ర‌యాణం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స్థానిక‌త‌కు ధ్రువీక‌ర‌ణకు గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రిగా చూపించాల‌న్నారు. బ‌స్ భ‌వ‌న్‌లో స‌జ్జ‌నార్ మీడియాతో మాట్లాడారు.


మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించార‌ని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో సీఎం రేవంత్ రేపు మ‌ధ్యాహ్నం ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తార‌ని, అందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం అని పేర్కొన్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు జీరో టికెట్ ఇస్తారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించొచ్చు. ఈ ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌జా ర‌వాణాకు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.


మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లుతో ప్ర‌జా ర‌వాణా తిరిగి పుంజుకుంటుంద‌న్నారు. ఈ ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి ఇప్ప‌టికే ఆర్టీసీ సిబ్బంది నిబంధ‌న‌లు జారీ చేశామ‌న్నారు. వారం రోజుల త‌ర్వాత బ‌స్సుల్లో ప్ర‌యాణించే మ‌హిళ‌లు.. రాష్ట్రం, కేంద్రం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల‌న్నారు. మ‌హిళ‌లు బ‌స్సు ఎక్క‌డైనా ఎక్కొచ్చు.. ఎక్క‌డైనా దిగొచ్చు. ఎన్నిసార్లు అయినా ప్ర‌యాణించొచ్చు అని స్ప‌ష్టం చేశారు. ఉచిత ప్ర‌యాణాల‌కు ఎలాంటి ప‌రిమితులు, ష‌ర‌తులు లేవు అని తెలిపారు. మ‌హిళ‌ల టికెట్ ఛార్జీల మొత్తాన్ని ప్ర‌భుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంద‌ని చెప్పారు.


రోజుకు రూ. 7 కోట్ల దాకా న‌ష్టం..


7292 బ‌స్సుల‌ను ఈ స్కీంలో వాడుకోవ‌డం జ‌రుగుతుంది అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆర్టీసీ బ‌స్సుల్లో 40 శాతం మంది మ‌హిళ‌లు ప్ర‌యాణిస్తున్నారు. ఇది 55 శాతం దాకా వెళ్లే అవ‌కాశం ఉంది. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని స‌ర్వీసులు పెంచే అవ‌కాశం ఉంది. రోజు వారి ఆదాయం రూ. 14 కోట్లు ఉంది. ప‌థ‌కం అమ‌లైన త‌ర్వాత ఆదాయం 50 శాతం త‌గ్గిపోతోంది. అంటే రూ. 7 కోట్ల దాకా వ‌స్తుంది. రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. రాబోయే రోజుల్లో 1,050 కొత్త బ‌స్సులు రాబోతున్నాయి. వెయ్యి ఎల‌క్ట్రిక్ బ‌స్సులు తీసుకుంటున్నామ‌ని, అందులో 500 సిటీకి, 500 రూర‌ల్ ఏరియాకు వ‌స్తాయని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు.