విధాత: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేట్లు లేదనేది పక్కన పెడితే, యుద్ధం అనేక కొత్త మలుపులు తిరుగుతున్నది. తాజాగా రష్యా ప్రభుత్వ సైన్యాలు సాధించలేని విజయాన్ని రష్యాకు చెందిన ప్రైవేటు సేన ‘వాగ్నార్’ సాధించినట్లు చెప్పుకొంటున్నారు.
రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నార్ ఉక్రెయిన్‌లోని సోలెడార్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దాని అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. కాగా అలాంటిదేమీ లేదని ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ ప్రకటించాడు. తమ సేనలు రష్యాసైన్యంతో భీకరంగా పోరాడుతున్నా యని తెలిపాడు.
ఉప్పుగనుల పట్టణమైన సోలెడార్ ఉక్రెయిన్ నగరాల్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే… రష్యా అధికార ప్రతినిధి దివిత్రి మెస్కోవ్ మాత్రం సోలెడార్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రకటించారు. సోలెడార్ తమ వశమైందని ప్రకటించటం తొందరపాటు అవుతుందని తెలుపటం గమనార్హం.
అయితే.. గతంలో ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా ప్రైవేటు సైన్యాలు ఒక యుద్ధంలో కీలకంగా మారి విజయాలు సాధించే దశకు చేరుకోవటం విపరీత పరిణామం. ప్రభుత్వాల నియంత్రణలో ఉండే సేనలకు ఓ యుద్ధ నియమాలుంటాయి. అంతర్జాతీయ యుద్ధనిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.
కానీ ప్రైవేటు సైన్యానికి ఇవేవీ పట్టవు. ఆ క్రమంలో ఆ సేనలు ఎంతటి అమానవీయ చర్యలకైనా ఒడిగట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోంచే యుద్ధాల్లో ప్రైవేటు సైన్యాల పాత్ర ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.
ఇదిలా ఉంటే… ‘వాగ్నార్’ ప్రైవేట్ సైన్యం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ప్రిగోజిన్ అధిపత్యంలోనిది. ప్రిగోజిన్ క్రెమ్లిన్‌లో ఆహార కాంట్రాక్టులు, ఆహారం సరఫరా చేసే కంపెని నిర్వాహకుడుగా పేరుగాంచాడు. పుతిన్ అంతరంగికుల్లో ఒకడుగా అతన్ని పుతిన్ చెఫ్‌గా చెప్పుకొంటారు. అలాంటి వ్యక్తి ఇవ్వాళ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా మారిన వైనం అనేక విధాలుగా చర్చనీయాంశం అవుతున్నది.
ఇదిలా ఉంటే… ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తున్నట్లు పోలండ్ ప్రకటించింది. ఇంతకు ముందే.. అమెరికా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు, పెద్ద ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో… రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌కు సాయం పేర పరోక్షంగా పోలండ్ యుద్ధంలో కాలు పెట్టినట్లయ్యింది. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికైతే దారి తీయదు కదా..? అనే ఆందోళన అయితే ప్రపంచ శాంతి కాముకుల్లో కనిపిస్తున్నది.