విధాత: తెలంగాణ ప్రభుత్వ టీచర్ల జీతాల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో కేసీఆర్ పాజిటివ్‌గా ఉన్నారు. ఆ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కారిస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. విద్యాశాఖలోని ఖాళీలను కూడా త్వరగా భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు.
వనస్థలిపురంలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 75వ వార్షికోత్సవ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంతకుముందు జీతాలు ఒకటో తేదీన వస్తుండే. ఇప్పుడు 10వ తేదీకి వస్తున్నాయి. ఈ జీతాల గురించి మీకు కూడా ఆందోళన ఉంది.
డబ్బులు ఉండి మీకు ఇవ్వకుండా ఉంటామా? కావాలని ఆపుతామా? మొదటి ఆరేడు ఏండ్లు ఎప్పుడు కూడా జీతాలు ఆగలేదు. ఏడాదికాలం నుంచి ఈ సమస్య వస్తుంది. ఇది మీకు కూడా తెలిసి ఉంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు.
బడ్జెట్ అసెంబ్లీలో పాస్ అయింది. రెండున్నర లక్షల కోట్లకు బడ్జెట్ పాస్ అయింది. బడ్జెట్ పాసైన తర్వాత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు ఎఫ్ఆర్బీఎం నిధులలో కోత పెట్టేసింది. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టడం లేదని రూ. 12 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రాకుండా నిలిపివేశారు.
ఫైనాన్స్ కమిషన్ చెప్పిన రూ. 5 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి హక్కుగా, వాటాగా రావాల్సిన రూ. 40 వేల కోట్లను కేంద్రం నిలిపివేసింది. దీంతో కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. దేశంలో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ ఉపాధ్యాయులే. వీలైనంత త్వరగా జీతాల సమస్యను పరిష్కరిస్తాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కేంద్రం మోడల్ స్కూల్స్‌ను రద్దు చేసినా.. మనం కొనసాగించాం..
కేంద్రం మోడల్ స్కూల్స్‌ను రద్దు చేసింది. అయినా మనం కొనసాగించాం అని హరీశ్‌రావు తెలిపారు. అంగన్‌వాడీల బడ్జెట్‌ను తగ్గించింది. కానీ మనం అంగన్‌వాడీల ప్రమాణాలను పెంచి బలోపేతం చేసుకుంటున్నాం. గురుకుల పాఠశాలలను 1201కి పెంచుకున్నాం. గురుకులాల బడ్జెట్ రూ. 3250 కోట్లు కేటాయించాం.
విద్యాశాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. అటవీ శాఖలో కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఇది దేశంలోనే తొలి యూనివర్సిటీ. అక్కడ చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయి ఉద్యోగాలను సంపాదిస్తున్నారు.
గురుకులాల్లో పీజీ, లా, డిగ్రీ కాలేజీలను ప్రారంభించుకున్నాం. వ్యవసాయ, వెటర్నరీ శాఖల్లో కూడా కాలేజీల స్థాపన జరుగుతుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.