Site icon vidhaatha

సంక్రాంతి ఫైట్.. తేనెతుట్టెను కదిలించిన దిల్ రాజు

విధాత‌: ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతికి విడుదల అంటూ రెండు చిత్రాల నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది కూడా. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా కూడా విడుదల కాబోతోంది.

ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు నిర్మించారు. దర్శకుడు కూడా తెలుగు డైరెక్టరే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ సినిమాగా విడుదల కానుందని.. ఈ మధ్య షూటింగ్స్ బంద్ సమయంలో దిల్ రాజు అండ్ యూనిట్ ప్రకటించారు. అందుకే తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేసినా.. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదు. దీంతో ఇది డబ్బింగ్ సినిమాగా తెలుగులో విడుదల కానుందని అంతా ఫిక్సయ్యారు.

అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు థియేటర్లు దిల్ రాజు గుప్పిట్లో ఉండటంతో.. తన సొంత సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ఆయన థియేటర్లను బ్లాక్ చేస్తున్నట్లుగా కొన్ని రోజులుగా టాక్ నడుస్తుంది. దీంతో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. ముందు జాగ్రత్తగా ఓ ప్రెస్‌నోట్‌ని అధికారికంగా విడుదల చేసింది.

అందులో.. ‘‘2019లో దిల్ రాజు సంక్రాంతి, దసరా వంటి పండుగ సమయాలలో స్ట్రయిట్ సినిమాలు ఉండగా.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రథ‌మ ప్రాధాన్యత ఇస్తూ.. మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపరిచి తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడు కోవాల‌న్నారు.

స్ట్రెయిట్‌గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రథ‌మ ప్రాధాన్యత ఇస్తూ.. మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరపున సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరుచున్నాము’’ అని తెలిపారు. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో.. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ‘వారసుడు’ వివాదం మొదలైంది.

పాన్ ఇండియా స్థాయికి సినిమాలు వెళుతున్న సమయంలో.. స్ట్రెయిట్, డబ్బింగ్ అంటూ ఈ తేడాలు ఏంటని.. డబ్బింగ్ సినిమాలను ఆపడం ఇప్పుడు అసాధ్యం అన్నారు. అలాగే ఇటీవల కన్నడ ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా దిల్ రాజుకు సపోర్ట్‌గా మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీరును తప్పుబట్టారు.

ఆయనతో పాటు కొంత మంది నిర్మాతలు కూడా ఇదే స్టేట్‌మెంట్ ఇస్తుంటే.. మరికొంత మంది మాత్రం.. టిఎఫ్‌పిసి ఏం తప్పు చెప్పలేదు.. వాళ్లు రీజనబుల్‌గానే చెప్పారు. పండుగకి స్ట్రెయిట్ సినిమాలకు ప్రయారిటీ ఇవ్వకపోతే.. ఆడియన్స్ ఒప్పుకుంటారా? అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కోలీవుడ్‌లో దిల్ రాజు ఏకంగా తేనే తుట్టెనే కదిలించాడు.

అక్కడి నిర్మాతలు టాలీవుడ్‌కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చేశారు. మీరు మా సినిమాలను ఆపితే.. మేము కూడా మీ సినిమాలను ఇక్కడ విడుదల చేయనివ్వం అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. దీంతో ఈ ‘వారసుడు’ వివాదం రెండు ఇండస్ట్రీల మధ్య చిచ్చుకు కారణమవుతుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలను మేమూ ఆదరించాం.. మా సినిమాలను ఎందుకు ఆదరించరు? అంటూ ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆదరించకపోవడంపై కూడా ఇన్‌డైరెక్ట్‌గా వారు కామెంట్స్ పేలుస్తున్నారు.

అయితే అలాంటి వారందరికీ.. టాలీవుడ్ సైడ్ నుండి ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే.. మీ దగ్గర స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు టాలీవుడ్ హీరోల సినిమాలకు ఎన్ని థియేటర్లు కేటాయిస్తున్నారు? ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని టాలీవుడ్‌లో ఎన్ని థియేటర్లలో విడుదల చేశారు? పండగల సమయంలో సానుకూలంగా చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించుకోవాలి గానీ.. ఎవరో, ఏదో చెప్పారని.. ఇలా ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇస్తే.. తర్వాత మీరే బాధపడాలి అంటూ గట్టిగా చురకలు అంటిస్తున్నారు.

స్ట్రెయిట్ అయినా, డబ్బింగ్ అయినా.. సినిమాలో కంటెంట్ ముఖ్యం. కంటెంట్‌లో దమ్ముంటే.. విడుదలైన రెండు రోజులకైనా థియేటర్లు పెరుగుతాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులే ఆదరిస్తారు.. వాటి గురించి ఆలోచించకుండా.. రెండు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం కరెక్ట్ కాదంటూ.. సినీ విమర్శకులు కొందరు సలహాలిస్తున్నారు.

Exit mobile version