Sapta Sagaralu Dhaati Movie Review | ప్రేక్షకులను వెంటాడుతుంది.. మరో మణిరత్నం సినిమా! హాయిగా చూడొచ్చు

  • మూవీ పేరు: ‘సప్త సాగరాలు దాటి’ (సైడ్ A)
  • విడుదల తేదీ: 22 సెప్టెంబర్, 2023
  • నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, పవిత్రా లోకేశ్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితాశ్వ, అవినాష్ తదితరులు
  • సినిమాటోగ్రపీ: అద్వైత గురుమూర్తి
  • సంగీతం: చరణ్ రాజ్
  • ఎడిటింగ్: సునీల్ భరద్వాజ్, హేమంత్ ఎమ్. రావ్
  • నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్
  • రచన, దర్శకత్వం: హేమంత్ ఎమ్. రావ్

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలపై ఇప్పుడు ప్రేక్షకులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అందుకు కారణం ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో పాటు ‘కాంతార’ చిత్రం సాధించిన విజయమే. అలాగే రక్షిత్ శెట్టి చేసే సినిమాలు.. మొదట్లో కాస్త గజిబిజిగా అనిపించినా.. చివరికి ఆ చిత్రాలకు అనూహ్యంగా అవార్డులు వరిస్తూ ఉంటాయి. అప్పుడు జనాలు ఆ సినిమాలను చూడటం మొదలు పెడతారు. రీసెంట్‌గా జాతీయ అవార్డ్ పొందిన ‘777 చార్లీ’ చిత్రాన్ని మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అవార్డ్ వచ్చిన తర్వాత ఎగబడి మరీ చూస్తున్నారంటే.. రక్షిత్ శెట్టి సినిమాలు తీసే లేయర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రయోగాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రక్షిత్ శెట్టి. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రం కన్నడలో విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఈ సినిమాను తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’- సైడ్ A పేరుతో.. టాలీవుడ్ అగ్రగామి సంస్థగా దూసుకెళుతోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేసింది. రీసెంట్‌గా విడుదలైన చేసిన ట్రైలర్, అలాగే కన్నడలో ఈ చిత్రానికి వస్తున్న టాక్, ఇటీవల రక్షిత్ శెట్టి సినిమాకు వచ్చిన జాతీయ అవార్డు.. ఇలా ఈ సినిమాని వార్తలలో నిలిచేలా చేశాయి. ఓ మంచి ప్రేమకథగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అసలు ఎలా ఉందో, ఇందులో ఉన్న మ్యాటర్ ఏమిటో.. మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కథగా చెప్పాలంటే.. ఇది ఓ మణిరత్నం సినిమా అని చెప్పొచ్చు. సరే అది విశ్లేషణలో చెప్పుకుందాంలే కానీ.. కథలోకి వస్తే.. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. వీరిద్దరూ మధ్య తరగతికి చెందిన వారే. ఎన్నో ఆశలతో బతికేస్తుంటారు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర మను కారు డ్రైవర్‌గా వర్క్ చేస్తుంటే.. ప్రియ ఏమో చదువుకుంటూ ఉంటుంది. ఆమె మంచి సింగర్ కూడా. ఎప్పటికైనా మంచి సింగర్ కావాలని కలలు కంటూ ఉంటుంది. మను, పాటలే ప్రపంచంగా బతికే ప్రియని.. పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడాలనే ప్రయత్నాల్లో.. మను చేసిన ఓ పొరపాటు అతడిని జైలుకు వెళ్లేలా చేస్తుంది. ఎందుకు మను జైలుకి వెళ్లాడు? మను జైలుకు వెళ్లడంతో ప్రియ ఏం చేసింది? ఎన్నో కలలు కన్న ఈ అందమైన జంట చివరికి ఆ కలలను సాకారం చేసుకుందా? అసలు వారి ప్రేమకథ ఎటువంటి మలుపులు తిరిగింది? తెలుసుకోవాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

 నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:


ఎటువంటి పాత్రకి అయినా జీవం పోయగలనని మరోసారి రక్షిత్ శెట్టి నిరూపించాడు. మను పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అలాగే హీరోయిన్ రుక్మిణీ కూడా తన సహజ నటనతో అలరించింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఈ జంట చూడచక్కగా అనిపిస్తారు. ఇద్దరూ కూడా ప్రాణం పెట్టి చేశారు. ఇద్దరి పాత్రలకు మంచి స్కోప్ ఇచ్చాడు దర్శకుడు. అలాగే మంచి నటీనటులు ఆ పాత్రలకు పడటంతో.. వారు కనబడే ప్రతి సీన్.. ప్రేక్షకులకు నచ్చేస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ నవ్వు.. ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. ఇంకా ఇతర పాత్రలలో చేసిన పవిత్రా లోకేష్, అచ్యుత్ కుమార్, శరత్ వంటి వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు ఏం కావాలో అది అందించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి కెమెరా వర్క్, అలాగే చరణ్ రాజ్ ఇచ్చిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్ అని చెప్పుకోవాలి. ఒక ప్రేమకథని ఎలా చూపించారో అలా కెమెరామ్యాన్, ఎలాంటి మ్యూజిక్ ఇస్తే.. ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో అలాంటి మ్యూజిక్‌ని సంగీత దర్శకుడు ఇచ్చారు. వీటితో పాడు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా మాత్రం.. ఇంకాస్త స్పీడ్‌గా సినిమా నడిస్తే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాప్‌లో కొన్ని సన్నివేశాలు, సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు స్లోగా నడిచినట్లుగా అనిపిస్తాయి. అలాంటి సీన్లపై కాస్త ఫోకస్ పెట్టాల్సింది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులంతా తమ పనితనాన్ని ప్రదర్శించారు. ఇక దర్శకుడు హేమంత్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఆయన రాసుకున్న కథ, స్ర్కీన్‌ప్లే, ఎన్నుకున్న నటీనటులు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ పరంగానూ.. కమర్షియల్ వే లో ఆలోచించకుండా.. ఒక నిజాయితీ గల ప్రేమకథని సముద్రానికి లింక్ చేస్తూ చెప్పిన విధానానికి అతనికి అభినందనలు చెప్పొచ్చు.

 విశ్లేషణ:

సముద్రానికి, ప్రేమకు లింక్ పెడుతూ.. సముద్రానికి చెందిన ప్రశాంతత, కల్లోలం రెండూ ప్రేమకి కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నమే ‘సప్త సాగరాలు దాటి’. దీనికి దర్శకుడు ఎన్నుకున్న స్టోరీ లైన్.. ఎటువంటి హడావుడి లేకుండా.. కూల్‌గా సినిమాలోకి లీనమయ్యేలా చేస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా దర్శకుడు డైరెక్ట్‌గా స్టోరీలోకి తీసుకెళ్లాడు. హీరోహీరోయిన్లు మధ్య ప్రేమ సన్నివేశాలతో మొదలెట్టి.. వారి కలలు ఎలా ఉన్నాయో చెబుతూ.. ఆ కలలు తీర్చుకునే ప్రయత్నంలో చేసిన పొరబాటుతో.. అందమైన జంట మధ్య సంఘర్షణని కలిగించాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులలో కూడా ఓ సంఘర్షణని క్రియేట్ చేశాడు. సినిమా అంతా కవితాత్మకంగా నడిపిస్తూనే.. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్స్ మిక్స్ చేసి.. అవి సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా అనుభవించేలా చేశాడు. అలా అనీ కేవలం ప్రేమకథ అనుకుంటే పొరబాటే అవుతుంది.

ఈ ప్రేమకథకి కొన్ని మలుపులు కూడా జోడించాడు. అందుకే కథ చెప్పేటప్పుడే ఇది మణిరత్నం సినిమాలా ఉంటుందని అంది. ఫస్టాఫ్ అంతా జాలీగా నడిపిస్తూ.. ఓ కొత్త ప్రపంచంలో విహరింప చేసిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా జైలు, కోర్టు డ్రామాతో నడిపించాడు. ఇక్కడ డైలాగ్స్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. కాకపోతే టైటిల్‌లో సైడ్ A అని పెట్టిన దర్శకుడు సైడ్ B (పార్ట్ 2) కోసం వేచి చూసేలా చేయడానికి.. సినిమా సెకండాఫ్‌ని కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఓ మంచి ప్రేమకథలో ఇలాంటి ఫీలింగ్ పంటికింద రాయిలా అనిపిస్తుంది. అసలు మను, ప్రియల ప్రేమకథకి పూర్తి న్యాయం సైడ్ Bలో చూడండి అనేలా.. సైడ్ A ‌ని ఎండ్ చేశాడు. అది కాస్త డిజప్పాయింట్‌గా అనిపిస్తుంది కానీ.. సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత కూడా హీరోహీరోయిన్ల పాత్ర స్వభావాలు ప్రేక్షకులని మాత్రం వెంటాడుతాయి. అంతవరకు పెట్టిన రూపాయికి న్యాయం జరిగేలా చేశాడు దర్శకుడు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. కాస్త ఓపికతో చూడాల్సిన సినిమా ఇది. సప్త సముద్రాలు అవసరం లేదు కానీ.. సినిమా టిక్కెట్ కొనుక్కుని హాయిగా అయితే చూడొచ్చు.

 

ట్యాగ్‌లైన్: సప్త సాగరాలు ఏమోగానీ.. టికెట్ కొనుక్కుని హాయిగా చూడొచ్చు

రేటింగ్: 3/5

Latest News