-కొత్త వడ్డీరేట్లు ఇవే..
విధాత: ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీరేట్లను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ పెంచింది. వివిధ కాలపరిమితులు గల ఎఫ్‌డీలపై 5 నుంచి 25 బేసిస్ పాయింట్లదాకా వడ్డీరేటును పెంచుతున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. కొత్త వడ్డీరేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయి. గత ఏడాది డిసెంబర్ 13న ఎస్బీఐ తమ ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను 65 బేసిస్ పాయింట్లదాకా పెంచింది. మళ్లీ రెండు నెలల తర్వాత ఇప్పుడే పెంచింది.
400 రోజులతో కొత్త ఎఫ్‌డీ
400 రోజులతో ఓ కొత్త టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎస్బీఐ ఈ సందర్భంగా పరిచయం చేసింది. వడ్డీరేటు 7.1 శాతం. వచ్చే నెలాఖరుదాకా ఇది అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. ఇక రూ.2 కోట్ల దిగువన ఉన్న ఎఫ్‌డీలపై ఎస్బీఐ అందిస్తున్న వడ్డీరేట్ల విషయానికొస్తే.. ఏడాది నుంచి రెండేండ్ల ఎఫ్‌డీలపై వడ్డీరేటు 6.75 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది.
రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీరేటు 6.75 శాతం నుంచి 7 శాతానికి, మూడేండ్ల నుంచి పదేండ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీరేటు 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగాయి. ఇక సీనియర్ సిటిజన్ల కోసం.. ఏడాది నుంచి రెండేండ్లలోపుండే ఎఫ్‌డీలపై ఉన్న వడ్డీరేటును 7.25 శాతం నుంచి 7.3 శాతానికి బ్యాంక్ పెంచింది.
రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు ఎఫ్‌డీలపై 7.5 శాతంగా, మూడేండ్ల నుంచి ఐదేండ్లలోపు ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీరేటును ప్రకటించింది. ఐదేండ్ల నుంచి పదేండ్లలోపున్న ఎఫ్‌డీలపై వడ్డీరేటును కూడా 7.25 శాతం నుంచి 7.5 శాతానికి బ్యాంక్ పెంచింది. ఇదిలావుంటే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఎస్బీఐ వుయ్‌కేర్ డిపాజిట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో రిటైల్ టైం డిపాజిట్ల (టీడీ)పై అదనపు ప్రయోజనాలు అందనున్నాయి.