అంత‌రిక్షంలో ఉప‌గ్ర‌హ శిథిలాల‌ను గుర్తించేందుకు ఓ కొత్త విధానం!

ఇటీవ‌లి కాలంలో అంత‌రిక్షం (Space) లోకి ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాలు, వ్యోమ‌గాముల మిష‌న్‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే

  • Publish Date - December 10, 2023 / 09:43 AM IST

విధాత‌: ఇటీవ‌లి కాలంలో అంత‌రిక్షం (Space) లోకి ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాలు, వ్యోమ‌గాముల మిష‌న్‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటువంటి మిష‌న్‌ల‌కు భూమి చుట్టూ తిరుగుతున్న ఉప‌గ్ర‌హ శిథిలాలు (Space Debris) తీవ్ర ప్ర‌మాదాన్ని క‌లుగ‌జేసేందుకు చాలా అవ‌కాశాలున్నాయి. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు క‌నుగొనేందుకు శాస్త్రవేత్త‌లు చాలా ప్ర‌యోగాలు చేస్తున్నారు.


తాజాగా యూనివ‌ర్సిటీ ఆఫ్ మిచిగ‌న్‌ (University of Michigan) కు చెందిన ప‌రిశోధ‌కులు చాలా చిన్న ప‌రిమాణంలో ఉండే ఉప‌గ్ర‌హ శిథిలాల‌ను గుర్తించ‌డానికి కొత్త విధానాన్ని క‌నుగొన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఉన్న విధానంలో కాంతిని, రేడియో సిగ్న‌ల్స్‌ను ప‌రావ‌ర్త‌నం చెందించ‌డం ద్వారా అంత‌రిక్ష వ్య‌ర్థాల‌ను శాస్త్రవేత్త‌లు గుర్తిస్తున్నారు.


అయితే ఆ శ‌కలాలు చాలా చిన్న‌విగా ఉండ‌టం వ‌ల్ల భూమి పైనుంచి పంపే సిగ్న‌ల్స్ వాటిని గుర్తించి, ప‌రావ‌ర్త‌నం చెంద‌డం క‌ష్టంగా మారింది. ఈ విధానంలో క్రికెట్ బాల్ క‌న్నా పెద్ద‌గా ఉండే వ‌స్తువుల‌ను మాత్ర‌మే గుర్తించ‌గ‌లుగుతున్నారు.


ఈ సైజులో ఉన్న శిథిలాల సంఖ్య మొత్తం వ్య‌ర్థాల్లో 1 శాతం కంటే త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం సుమారు 17 కోట్ల అంత‌రిక్ష వ్య‌ర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయ‌ని ఒక అంచ‌నా. ఈ లెక్క‌ను బ‌ట్టి ఇందులో ఎక్కువ భాగం క్రికెట్ బాల్ సైజు క‌న్నా త‌క్కువ ప‌రిమాణంలో ఉన్న‌వే. అందుకే వీటిని గుర్తించ‌డంపై శాస్త్రవేత్త‌లు ఎక్కువ దృష్టి పెట్టారు.


ఏమిటీ విధానం..?


చిన్న చిన్న ప‌రిమాణంలో ఉండే ఉప‌గ్ర‌హ వ్య‌ర్థాలు త‌ర‌చూ ఒక‌దాన్నొక‌టి ఢీకొట్టుకుంటాయి. ఇలా జ‌రిగిన‌పుడు అవి మ‌రింత చిన్న చిన్న తంతువులుగా మారిపోతాయి. ఆ తాకిడితో ఉత్ప‌త్తి అయిన ఉష్ణోగ్ర‌త వ‌ల్ల ఈ తంతువుల్లో కొన్ని వాయువులుగా మారిపోతాయి. ఈ ప్ర‌క్రియ వ‌ల్ల చిన్న స్థాయి మెరుపు వ‌చ్చి ఎల‌క్ట్రిక్ సిగ్న‌ల్స్ జ‌నిస్తాయి.


వీటిని భూమి నుంచి గుర్తించ‌డం కూడా తేలిక‌. మిచిగ‌న్ యూనివ‌ర్సిటీ లో ఉన్న అత్యుత్త‌మ రేడియో రిసీవ‌ర్ ఈ సిగ్న‌ల్స్‌ను ప‌క్కాగా ప‌సిగ‌ట్టింది. త‌ద్వారా ఈ విధానంలో ఎప్ప‌టిక‌ప్పుడు అంత‌రిక్ష వ్య‌ర్థాల‌ను గుర్తించొచ్చ‌ని శాస్త్రవేత్త‌లు తెలిపారు. మ‌రీ ముఖ్యంగా కంటికి క‌నిపించ‌ని ఒక మిల్లీ మిట‌ర్ వ్యాసం క‌న్నా త‌క్కువ ఉన్న వ‌స్తువుల‌ను కూడా ఈ విధానంలో గుర్తించొచ్చ‌ని తెలిపారు.


ఈ వ్య‌ర్థాలు ఎందుకంత ప్రమాద‌క‌రం?


అంత‌రిక్షంలో భూమి చుట్టూ తిరిగే ఉప‌గ్ర‌హ వ్య‌ర్థాలు చాలా ప్ర‌మాద‌క‌రం. ఒక ద్రాక్ష పండు ప‌రిమాణంలో ఉండే కొన్ని కొన్ని ఉప‌గ్ర‌హ శిథిలాలు గంట‌కు 35 వేల కి.మీ. వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఈ వేగంలో క‌నుక అవి ఏదైనా శాటిలైట్‌ను ఢీకొన్నా, వ్యోమ‌నౌక‌ల‌ను ఢీకొన్నా పెను ప్ర‌మాద‌మే జ‌రుగుతుంది. అందులోనూ చిన్న చిన్న శిథిలాల వ‌ల్లే ఎక్కువ ప్ర‌మాదాలు సంభ‌విస్తాయి. ఇవి కూడా మ‌ళ్లీ ఒక‌దానినొక‌టి ఢీకొన్ని మ‌రింత చిన్న చిన్న తంతువులుగా మారిపోతాయి.

Latest News