ట్రంప్‌కు తగ్గ బైడెన్‌: ట్రంప్‌, బైడెన్‌ కార్యాలయాల్లో రహస్య పత్రాలు ఎలా..?

బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్ప‌టి కార్యాలయంలో రహస్య పత్రాలు..! అమెరికా వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం.. విధాత: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఏమీ తీసిపోవటం లేదని తెలిసి వస్తున్నది. ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ప్రైవేట్ ఎస్టేట్‌లో ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలక రహస్య పత్రాలు లభించాయని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. తాజాగా బైడెన్‌ తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నకాలంలో ఉపయోగించిన కార్యాలయంలో రహస్య పత్రాలు లభించాయన్న […]

  • Publish Date - January 10, 2023 / 10:50 AM IST
  • బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్ప‌టి కార్యాలయంలో రహస్య పత్రాలు..!
  • అమెరికా వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం..

విధాత: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఏమీ తీసిపోవటం లేదని తెలిసి వస్తున్నది. ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ప్రైవేట్ ఎస్టేట్‌లో ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలక రహస్య పత్రాలు లభించాయని అప్పట్లో పెద్ద దుమారం రేగింది.

తాజాగా బైడెన్‌ తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నకాలంలో ఉపయోగించిన కార్యాలయంలో రహస్య పత్రాలు లభించాయన్న సమాచారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. వీరి వ్యవహారాలను విశ్లేషిస్తున్న వారు ఇద్దరూ ఇద్దరే అని వ్యంగంగా చురకలంటిస్తున్నారు.

ఒబామా హయాంలో జో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ కాలంలోనే ఆయన పెన్సిల్వేనియా యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ‘ది పెన్న్‌ బైడెన్‌ సెంటర్‌ ఫర్‌ డిప్లమసీ అండ్‌ గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌’ అనే పేరుతో ఓ కార్యాలయాన్ని వినియోగించుకున్నారు.

దీన్ని ఆయన 2017నుంచి 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం దాకా తన కార్యాలయంగా ఉపయోగించారు. ఆ కార్యాలయంలోనే ఇప్పుడు సుమారు డజన్‌ రహస్య పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తున్నది. ఆ పత్రాలు సెన్సిటివ్‌ కంపార్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ విభాగానికి చెందినవిగా భావిస్తున్నారు.

సాధారణంగా ఈ కేటగిరిలో ఇంటలిజెన్స్‌ విభాగం నుంచి సేకరించిన సమాచారాన్ని మాత్రమే చేరుస్తారని అంటున్నారు. వీటిని గుర్తించిన వెంటనే అక్కడి అధికారులు అమెరికా ఆర్కేవ్స్‌ విభాగానికి, ఇంటలిజెన్స్‌ విభాగానికీ సమాచారం అందించారు. వారు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని షికాగో అటార్నీ జనరల్‌ జాన్‌లాష్‌ జూనియర్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా రహస్య పత్రాలు గతంటో ట్రంప్‌ ఎస్టేట్‌లో కూడా పెట్టెల కొద్దీ దొరికాయి. ట్రంప్‌ ఎన్నికల్లో ఓడి పోయిన తర్వాత అధ్యక్ష పదవినీ, భవనాన్నీ వీడేది లేదని మొండికేసి కూర్చొన్నాడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే తాను ఓటమి పాలయ్యానని చెప్పుకోవటమే కాదు, తన మద్దతుదారులను తన అధ్యక్ష భవనాన్ని రక్షించాల్సిందిగా పిలుపునిచ్చాడు.

ఒకానొక దశలో ఆయన మద్దతుదారులు వైట్‌ హౌస్‌ను ఆక్రమించుకొనే ప్రయత్నం చేశారు. ఇలాంటి చర్యలు అమెరికా చరిత్రలో మొదటిసారి జరిగాయి. దీంతో అక్కడి పోలీసులు, ఎఫ్‌బీఐ బలవంతంగా ట్రంప్‌ను అధ్యక్ష భవనం నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది.

ఆ తర్వాత కాలంలో ట్రంప్‌ సొంత ప్రైవేట్‌ ఎస్టేట్‌ మార్‌-ఎ-లాగో లో రహస్య పత్రాలున్నట్లు ఎఫ్‌బీఐకి సమాచారం అందటంతో దానిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. అందులో 15 పెట్టెల్లో రహస్య పత్రాలు లభించాయి. అందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలున్నట్లు తెలిసింది. వాటిలో అతిసున్నితమైన 325 రహస్య పత్రాలను ఎఫ్‌బీఐ కనుగొన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అత్యున్నత అధికార పదవుల్లో ఉన్న వారికి ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలు అందుబాటులో ఉండటం సహజమే. అయితే… పదవినుంచి దిగిపోయిన తర్వాత వాటిని తిరిగి ప్రభుత్వ పరం చేయాలి. అలా చేయకుండా రహస్య పత్రాలను తమ వద్దనే ఉంచుకోవటం సమర్థనీయం కాబోదు. అందుకనే గతంలో ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ విషయంలోనూ అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది