విధాత: మీ పేరు రాష్ట్రాలు, దేశాలు ఆ పైన ఖండాతరాలు.. ఆ పైన విశ్వాంతరాళాలలోకి వెళ్లాలని ఆశపడుతున్నారా? అలాంటి కోరికను తీరుస్తామంటోంది నాసా (NASA). తాము చేపట్టబోయే మిషన్ ద్వారా కొంతమంది పేర్లను గురు (Jupiter)గ్రహం చుట్టూ తిరిగే యురోపా (Europa) అనే చందమామ పైకి తీసుకెళ్తామని ప్రకటించింది. అయితే ఇందుకోసం 2023 చివరికల్లా తమకు పంపిచాలని స్పష్టం చేసింది. వీటిని తీసుకుని త్వరలోనే యురోపా స్పేస్ క్లిప్పర్ (Europa Space Clipper) వ్యోమనౌక గురుగ్రహం వైపు వెళుతుంది. 2030 నాటికి ఇది గురు గ్రహం కక్ష్యకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ పేర్లు పంపించే కార్యక్రమానికి నాసా ద మెసేజ్ ఇన్ బాటిల్ అనే పేరు పెట్టింది. తమ పేర్లను పంపడానికి ఏ డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఈ తరహా మెసేజ్‌లనే నాసా తన వ్యోమనౌకల్లో పంపించేది. ఇప్పటికీ సౌర కుటుంబంలో తిరుగుతున్న పలు ఉపగ్రహాల్లో సాధారణ మనుషుల వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఓ పేరు పంపండి. మేముదాన్ని యురోపా క్లిప్పర్ ద్వారా గురు గ్రహం మీదకు పంపుతాం. ఇందు కోసం మీరు పంపిన పేరు 2.9 బిలియన్ కి.మీ. ప్రయాణిస్తుంది. డిసెంబరు 31, 2023 వరకే గడువు త్వరపడండి అని నాసా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
ఈ పేర్లే కాకుండా అమెరికా కవి అడా లిమన్ రాసి ఇన్ ప్రైస్ ఆఫ్ మిస్టరీ: ఏ పోయమం ఫర్ యురోపా అనే కవితనూ నాసా పంపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో అడా లిమన్ ఈ కవితను రాసి నాసాకు అందించారు. ఒక వ్యోమనౌక మీద కవిత రాయడం ఒక గొప్ప అనుభూతి. కానీ కష్టంగా కూడా అనిపించింది అని లిమన్ గుర్తు చేసుకున్నారు. గురు గ్రహానికి ఉపగ్రహమైన యురోపాపై పరిశోధనలు చేయడమే యురోపా స్పేస్ క్లిప్పర్ ముఖ్య ఉద్దేశం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఆ చందమామపై జీవం ఉనికి ఏమైనా ఉందా అని క్లిప్పర్ పరిశోధిస్తుంది.