మలుపులు తిరుగుతున్న రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతున్న కొద్ది ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. కేసులో 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

  • Publish Date - February 29, 2024 / 09:59 AM IST

  • లిషిత కనిపించడం లేదంటూ సోదరి కుషిత ఫిర్యాదు
  • కీలకంగా మారిన అబ్బాస్ వాంగ్మూలం
  • మీర్జా వహిద్ విచారణతో మరింత పురోగతి


విధాత, హైదరాబాద్‌ : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతున్న కొద్ది ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. కేసులో 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానందకు సయ్యద్ అబ్బాస్ కొకైన్‌ను మీర్జా వహిద్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఎప్పటి నుంచి వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు..ఎవరెవరికి ఇచ్చారన్నదానిపై మీర్జా వహిద్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. సోమవారం వస్తానని ఆయన సమాచారం ఇచ్చారు.


మరోవైపు కేసులో నిందితురాలిగా ఉన్నసినీ నటి, యూట్యూబర్ లిషిత కనిపించడంలేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ మొదలైనప్పటి నుంచి లిషిత పరారీలో ఉండగా, మూడు రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఈ నోటీసులకు లిషిత సోదరి కుషిత పోలీస్ స్టేషన్‌కు వచ్చి సమాధానం ఇచ్చారు. ఆమె ఇంట్లో లేదని వచ్చాక విచారణకు పంపిస్తామని తెలిపారు.


డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు లిషిత ఖచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు. ఇక గజ్జల వివేకానంద డ్రగ్ పార్టీల వివరాల కోసం పోలీసులు అతడి వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఈ కేసులో వివేకానంద స్నేహితులు, సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, శ్వేత, లిషిత, నేయిల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.


పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషిత తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. అటు రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీకి సంబంధించి సాక్ష్యాధారాల సేకరణ పోలీసులకు సవాల్‌గా తయారైంది. ఈ స్టార్ హోటల్లో మొత్తం 209 సీసీ కెమెరాలు ఉన్నా.. డ్రగ్స్ పార్టీ జరిగిన రూం వైపు సీసీ కెమెరాలు పనిచేయలేదని తెలుస్తుంది. అదే నిజమైతే డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారన్న వివరాల సేకరణ పోలీసులకు కష్టతరం కానుంది.


కీలకంగా మారిన డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ స్టేట్‌మెంట్‌


రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం కేసు విచారణలో కీలకంగా మారింది. అబ్బాస్ తన వాంగ్మూలంలో మీర్జా వహీద్ వద్ద తను తరుచుగా కొకైన్ కొనుగోలు చేస్తూ ప్రధాన నిందితుడు గజ్జల వివేకానందకు సరఫరా చేశాడు. వివేకానంద డ్రైవర్‌ గద్దల ప్రవీణ్ కు అబ్బాస్ అందించేవాడు. గ్రామ్ కొకైన్‌ను మీర్జా వహీద్ వద్ద అబ్బాస్‌ రూ.14వేలకు కొనుగోలు చేసి గజ్జల వివేకానందకు విక్రయించేవాడు.


కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమీషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్‌కు గజ్జల వివేకానంద అలవాటుపడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈనెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేకానందకు అబ్బాస్ కొకైన్ ఇచ్చినట్టు పోలీసులకు తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది.

Latest News