సూట్ కేసు కానుక..ఇక సర్దుకోండంటూ వ్యాఖ్య
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పెషల్ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్ కేసును గిఫ్ట్‌గా పంపించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని, అందుకే ఆయనకు సూట్‌కేస్ గిఫ్ట్ ఇస్తున్నామని బైబై కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలు అధికార మార్పిడి కోరుకున్నారన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారం కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయవద్దన్నారు. ప్రజాతీర్పును రెఫరెండమ్‌గా కేసీఆర్ గౌరవించాలని డిమాండ్ చేశారు. 2014, 2018లో 40 మంది ఎమ్మెల్యేలను, నలుగురు ఎమ్మెల్సీలను, ఒక ఎంపీని కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇది మళ్లీ రిపీట్ కాకూడదన్నారు. కేసీఆర్‌కు మించిన కరప్టెడ్ పొలిటీషియన్ లేరని అమిత్ షా, ప్రధాని మోడీలు చెప్పారని, బీజేపీ, బీఆరెస్ రెండు ఒకటి కాకపోతే కేసీఆర్ అవినీతిపై ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు.
బీఆరెస్, బీజేపీలు కుమ్మక్కు కాకపోతే ఈ ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆరెస్‌కు మద్దతు ఇవ్వకుండా ఉండాలన్నారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్ధేశంతో పోటీ చేయలేదన్నారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 71మంది 10వేల ఓట్ల లోపు మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు. ముందుగా ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం మారాలని.. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని షర్మిల వ్యాఖ్యానించారు.