Site icon vidhaatha

గాద‌రికి చుక్కెదురు.. కిషోర్ పిటిష‌న్‌ను కొట్టివేసిన హైకోర్టు

త‌దుప‌రి విచార‌ణ అక్టోబ‌ర్ 3కు వాయిదా


విధాత‌, హైద‌రాబాద్: గాద‌రి కిషోర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తుంగతుర్తి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదంటూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అద్దంకి దయాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నిక‌ల్లో తుంగ‌తుర్తిలో బీఆర్ఎస్ నుంచి బ‌రిలో దిగి ఎమ్మెల్యేగా గుర్తింపుపొందిన గాద‌రి కిషోర్ ఎన్నిక చెల్ల‌ద‌ని, ఆయ‌న ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌లో త‌న ఆస్తుల‌కు సంబంధించి త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని 2019లో అద్దంకి ద‌యాక‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.


అయితే అద్దంకి ద‌యాక‌ర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేయాల‌ని ఎమ్మెల్యే గాదరి కిషోర్ గ‌తంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయ‌గా న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. అయితే తాజాగా దానిని ఛాలెంజ్ చేస్తూ.. రెండో సారి కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. దీనిపై బుధ‌వారం హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎం.ల‌క్ష్మ‌ణ్ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.


అద్దంకి దయాకర్ పిటిషన్ కొట్టేయాలని గాదరి కిషోర్ రెండోసారి దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ మరోసారి కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి అర్హుడుకాద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ఎన్నికల‌ ఫలితాలు, కౌంటింగ్ వీడియోకు సంబంధించి పూర్తి వీడియో ఫుటేజ్ స‌మ‌ర్పించాల‌ని జిల్లా కలెకర్ట్‌కు న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబర్ 3కు వాయిదా వేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

Exit mobile version