Shocking |
తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన వారినే ఆశ్చర్యానికి.. అదే సమయంలో గగుర్పాటుకు గురి చేసింది. గత రెండు దశాబ్దాలుగా మానవులు భూగర్భ జలాల్ని ఎలా పడితే అలా తోడేయటంతో.. భూ అక్షంలో మార్పు సంభవించిందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే జియో ఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ఈ పరిశోధన వెలువడింది. దీని ప్రకారం.. భూమి తన అక్షం నుంచి 80 సెం.మీ. (31.5 ఇంచ్‌లు) పక్కకు జరిగిందని తేలింది. దీనికి కారణం 1993 నుంచి 2010 వరకు మనుషులు విచ్చలవిడిగా భూ గర్భ జలాన్ని తోడేయడమేనని స్పష్టమైంది.
ఎంత తోడేశాం..
ఎక్కడికక్కడ భారీ బోర్లు తవ్వేసి.. 1993 నుంచి 2010 వరకు సుమారు 2,150 గిగాటన్నుల భూగర్భ జలాలను తోడేశామని పరిశోధన పత్రం పేర్కొంది. అంటే ఎంత మొత్తమో తెలుసా.. ఆ నీటితో మనం అత్యంత పెద్దదైన ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సుని నింపేయచ్చు. అంతే కాకుండా ఆ మొత్తం నీటి బరువు 5.5 మిలియన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లతో సమావేశం. మరోవైపు ఈ తోడేసిన భూగర్భజలాలు అటు తిరిగీ సముద్రాల్లోకి వెళ్లాయి. దీని వల్ల సముద్రాల ఎత్తు ఆరు మి.మీలు పెరిగిందని ఒక అంచనా.
భారత్‌లో నీటిని పొదుపుగా వాడితే చాలు !
భూమిపై నీటి నిల్వలకు, భూ అక్షానికి ఉన్న సంబంధం 2016లోనే బహిర్గతమైనా.. స్పష్టంగా భూగర్భజలాల ప్రభావంపై పరిశోధన జరగడం ఇదే మొదటిసారి. శాస్త్రవేత్తలు తాము రూపొందించిన సిమ్యులేషన్ డిజైన్‌లో 2150 గిగా టన్నుల నీటిని తిరిగి ప్రవేశపెట్టగా.. భూ అక్షం తిరిగి యథాస్థితికి వచ్చినట్లు గుర్తించారు. అంటే మనం భూగర్భ జలాలను పొదుపుగా వాడుకుంటే కొన్ని దశాబ్దాలకైనా తిరిగి భూమి తన యథాస్థానానికి వస్తుంది.
అయితే ఆ నీటి నిల్వలు ఎక్కడ పెరగాలనే దానిపైనా శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. మధ్య అక్షాంశాల దగ్గర ఉన్న ఉత్తర అమెరికా, వాయవ్య భారత్‌లలో భూగర్భ జలాలను పెంచగలిగితే ఈ ప్రమాదాన్ని నిలువరించొచ్చని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ చిత్తశుద్ధితో కొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని పరిశోధనకు నేతృత్వం వహించిన కి వియోన్ సియో సూచించారు.