విధాత ప్రత్యేక ప్రతినిధి: పీసీసీ (Pcc)చీఫ్ మహేష్ గౌడ్‌తో గాంధీ భవన్‌లో సోమవారం సీపీఐ (CPI)నేతలు భేటీ అయ్యారు. మిత్రపక్షాల పొత్తు ధర్మంలో భాగంగా సీపీఐకి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని వారు కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీఐకి ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించగా, కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ పొత్తు సందర్భంగా ఒక ఎమ్మెల్యే స్థానంతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తామని అప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీని ప్రస్తుతం అమలు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడిని సీపీఐ నాయకులు కోరారు.
ప్రస్తుతం తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తమకు కేటాయించాల్సిన స్థానాన్ని కేటాయించమని కోరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున నాయకులు ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం కేటాయిస్తుందా? లేదా? అనేది అనుమానంగా చెబుతున్నారు. ఏమైనప్పటికీ సీపీఐ నాయకులు మాత్రం తమవంతు ప్రయత్నాన్ని చేస్తున్నారు.
సీపీఐ నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ తో భేటీ అయిన వారిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, ఎం.బాల నర్సింహ, ఈటీ నర్సింహ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని కొరుతూ సీపీఐ నాయకులు పీసీసీ చీఫ్ కి వినతి పత్రం అందజేశారు.