Site icon vidhaatha

Chada Venkat Reddy | గిరిజన హక్కులను సాధించే వరకు కేంద్రంపై పోరాడుతాం : మాజీ ఎంఎల్ చాడా వెంకట్ రెడ్డి

తెలంగాణ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా “ ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం

విధాత, హైదరాబాద్ : ఆదివాసీ గిరిజన హక్కులను సాధించే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని, ఇందుకు గిరిజన సమాఖ్య సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సమాఖ్య మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమాఖ్య సమితిల ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవ’ కార్యక్రమం హైదరాబాద్ మగ్ధూం భవన్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతలు వి. స్వరూప, కె. నారాయణ నాయక్, జె. శివ నాయక్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా,ముఖ్యఅతిథిగా చాడా వెంకట్ రెడ్డి పాల్గొనగా, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్ ప్రారంబోఉపన్యాసం చేసారు. కార్యక్రమానికి ముందు చాడ వెంకట్ రెడ్డి సమాఖ్య జెండా ఎగుర వేసి పలువురు గిరిజనులకు సన్మానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ లంబాడా, చెంచు, కోయా తదితర 33 తెగలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, వీరంతా గుట్టలు చెట్లలో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ పాలకులు గిరిజన హక్కులు ఏరకంగాను అమలు కాలేదని అన్నారు. తాత ముత్తాతల నుండి ఎన్నో ఏళ్లగా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన ఆదివాసీలకు ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అటవీ భూములకు హక్కులకు కావాలని పోరాడితేనే చట్టం వచ్చిందని, 2006లో వచ్చినా ఇప్పటి వరకు దానిని అమలు చేయడం లేదన్నారు. 2004లో యూపిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అటవీ హక్కుల చట్టం వచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా జోడేఘట్ నుండి తెలంగాణ రాష్ట్రం అంతటా పోడు యాత్రను సీపీఐ చేపట్టిందని గుర్తు చేశారు. ఈ పోడు యాత్రకు ఒక గిరిజన బిడ్డగా మంత్రి సీతక్క కూడా అప్పట్లో మద్దతుగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ఆరు పథకాలను అమలు చేస్తామని చెబుతున్న మంత్రి సీతక్క గిరిజన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విత్తనాలు ఎరువులు సరఫరా తదితర రాష్ట్ర స్థాయి రైతు భరోసా వంటివి కూడా గిరిజనులకు అమలు చేయాలన్నారు. గతంలో సిఎంగా ఉన్న కెసిఆర్ దళిత బందు , గిరిజన బందు పేరుతో పథకాలను ప్రవేశపెట్టినా వాటిని అమలు చేయనందుకే కెసిఆర్ పాలనకు ప్రజలు బంద్ పెట్టారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చారని, చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని, ధరణి ని సర్వే నెంబర్ల వారిగా సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములు చేసుకుంటున్న వారికి భూములు ఇవ్వడంతో పాటు పట్టాలు కూడా ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. గిరిజన సమాఖ్య సమితి చేసే ప్రతి పోరాటానికీ తమ మద్దతునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్. అంజయ్య నాయక్, సమాఖ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంబోతు రాజు నాయక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు లతా, నేతలు గణేష్ నాయక్, దేవరాజ్, ఆర్. శంకర్ నాయక్, భిక్షు నాయక్. లోక్యానాయక్, శివ, రాజు నాయక్, తిరుపతి, కవితాబాయి, సునీతాబాయి, సరిలాల్ నాయక్, కమ్లి బాయి, వి ముత్యాలి, రాత్లావత్ రురుక్మా,వడిత్య కమ్మ, రాత్లావత్ చక్రి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version