సీపీఎం పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్‌కే మా మద్దతు: సీతారాం ఏచూరీ

తెలంగాణలో సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తెలిపారు

  • Publish Date - November 25, 2023 / 12:01 PM IST

విధాత : తెలంగాణలో సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తెలిపారు. శనివారం ఆయన పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, ఇందులో భాగంగానే సీపీఎం అభ్యర్థులు పోటీలోలేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే మా మద్దతు ఉంటుందన్నారు.


తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఉంటుందని, తాము ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నామన్నారు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా నష్టం లేదనే భావనలో కాంగ్రెస్ ఉందన్నారు. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారన్నారు. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవమని సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి మేం యాంటీ టీమ్ గా ఉంటామన్నారు. బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమన్నారు.


దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదని, 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలంగా ఉన్నా ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని జోస్యం చెప్పారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆరోపించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని విమర్శించారు. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై బాధ్యతగా వ్యవహరించడంలేదని, సొరంగానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఆ ఘటనకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, అయినా ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వదన్నారు.