న‌దిలోకి దూకిన సైబ‌ర్ నేర‌గాళ్లు.. పోలీసులు ఏం చేశారంటే..?

సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్న ఓ ఆరుగురు నిందితుల‌ను జార్ఖండ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితులు త‌ప్పించుకునేందుకు న‌దిలో దూకినా కూడా పోలీసులు వ‌ద‌ల్లేదు

  • Publish Date - December 11, 2023 / 06:04 AM IST

రాంచీ : సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్న ఓ ఆరుగురు నిందితుల‌ను జార్ఖండ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితులు త‌ప్పించుకునేందుకు న‌దిలో దూకినా కూడా పోలీసులు వ‌ద‌ల్లేదు. పోలీసులు కూడా న‌దిలోకి దిగి నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.


వివ‌రాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన ఓ ఆరుగురు వ్య‌క్తులు సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. యాప్‌ల ద్వారా న్యూడ్ కాల్స్ చేస్తూ, మ‌హిళ‌ల‌ను వేధిస్తూ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సైబ‌ర్ క్రిమినల్స్‌పై దృష్టి సారించారు.


నిందితుల మొబైల్ లోకేష‌న్ ఆధారంగా బ‌రాక‌ర్ న‌ది ఏరియాలో సంచ‌రిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అక్క‌డికి సివిల్ దుస్తుల్లో చేరుకున్నారు. న‌ది ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసుల‌ను గ‌మ‌నించిన నేర‌గాళ్లు.. త‌ప్పించుకునేందుకు న‌దిలోకి దూకారు. పోలీసులు అప్ర‌మ‌త్త‌మై న‌దిని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. న‌దిలోకి పోలీసులు దిగి ఆరుగురు క్రిమిన‌ల్స్‌ను అరెస్టు చేశారు.


నిందితుల నుంచి రూ.8,29,600 న‌గ‌దు, 12 మొబైల్స్, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్ కార్డ్స్, 12 పాస్‌బుక్స్, ఆరు చెక్ బుక్స్, నాలుగు పాన్ కార్డులు, రెండు ఆధార్ కార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు.