Hyderabad | మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కొడుకు పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఏడ్చాడని చెప్పి.. కుమారుడిని కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన నేరెడ్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సుధాకర్, దివ్య అనే దంపతులు ఇద్దరూ జేజే నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 2019లో వివాహం కాగా, రెండేండ్ల కుమారుడు ఉన్నాడు. జీవనోపాధిలో భాగంగా ఎస్ఎస్బీ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు సుధాకర్. అయితే సుధాకర్ సోమవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి, ఇంటికి వచ్చాడు. అదే సమయంలో కుమారుడు జీవన్ ఏడ్వడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రి.. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ జీవన్ ను మందలించాడు. కోపంతో కొట్టాడు. దీంతో జీవన్ ప్రాణాలు కోల్పోయాడు.
కుమారుడు చనిపోవడంతో దివ్య బోరున విలపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.