Site icon vidhaatha

Monsoon । కరువు కోరల్లో దక్షిణాది.. ఉత్తరాదిని ముంచెత్తిన భారీ వర్షాలు

Monsoon

Monsoon । న్యూఢిల్లీ: ఇటీవల పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు చూశాం. కానీ.. నిజానికి దేశంలో సగభాగం తీవ్ర వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్నది. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొని ఉన్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ గురుప్రసాద్‌ శర్మ చెప్పారు. కేరళ, ఉత్తర కర్ణాటకలో దాదాపు 35శాతం లోటు వర్షపాతం ఉన్నదని తెలిపారు. మొత్తంగా దక్షిణ భారతదేశం భారీ స్థాయిలో 22 శాతం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నదని, బాగా వర్షాలు పడే ప్రాంతాల్లో ఒకటైన కేరళలో కూడా భారీ స్థాయిలో లోటు వర్షపాతం ఉన్నదని వివరించారు.

పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఒడిశా రాష్ట్రాల్లో ఈపాటికి కురవాల్సిన వర్షాల్లో 20 నుంచి 40 శాతం వరకూ తక్కువ వర్షపాతం రికార్డయిందని చెప్పారు. జార్ఖండ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఇక్కడ 45శాతం లోటు వర్షం ఉన్నది. ఆగ్నేయ భారతదేశంలో మాత్రమే భారీ వర్షాలు కురిశాయి. ఇది అధిక వర్షపాతం. వాటి వల్లే మొత్తం దేశ సగటు 2 శాతం పెరిగింది తప్పించి.. అనేక రాష్ట్రాలు చినుకు కోసం ఎదురు చూస్తున్నాయి.

తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 17 శాతం లోటు వర్షపాతం రికార్డయిందని ఐఎండీ డాటా పేర్కొంటున్నది. మధ్య భారతదేశంలో పెద్ద సంఖ్యలో రైతులు రుతుపవనాలను నమ్ముకునే వ్యవసాయం చేస్తారు. ఇక్కడ నాలుగు శాతం అధిక వర్షపాతం నమోదైంది. చండీగఢ్‌ నగరంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో 24 గంటల వ్యవధిలో 322 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుజరాత్‌లో నైరుతి సీజన్‌కు ముందు వచ్చిన తుఫాన్‌ ధాటికి తగినంత వర్షం కురిసింది.

ఇది కేరళ వంటి ప్రాంతాలతో పోల్చితే.. పూర్తి భిన్నమైన పరిస్థితి. ఎందుకంటే.. కేరళలో జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకూ సుమారు 992.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదై ఉండాలి. కానీ.. కేవలం 639.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే.. సాధారణం కంటే 36శాతం తక్కువ. సాధారణంగా జూలై నెలలో కేరళలో ప్రతి రోజూ వర్షం కురుస్తూనే ఉంటుంది. అందులో అప్పుడప్పుడు భారీ వానలు ఉంటాయి.

కానీ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఒకటి రెండు రోజులు మాత్రమే భారీ వర్షాలు కురిశాయని గురుప్రసాద్‌ శర్మ చెప్పారు. జూలై నెల నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొత్తం దేశానికి అత్యంత కీలకమైనది. ఈ నెలలోనే మొత్తం వర్షపాతంలో 35శాతం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో జూలై, ఆగస్ట్‌ నెలల్లో రుతుపవనాలు చురుకుగా ఉంటాయి. కానీ.. తూర్పు ప్రాంతంలో అక్టోబర్‌ వరకూ.. అంటే నాలుగు నెలల పాటు వర్షాలు కురుస్తాయి.

అధిక వర్షాలతోనూ నష్టమే

వర్షపాతం సాధారణంగా ఉంటే అన్ని ప్రాంతాల రైతులు బాగుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఒక ప్రాంతం రైతులు అధిక వర్షపాతంతో పంటలు నష్టపోతుంటే.. మరోవైపు వర్షాలే లేక వ్యవసాయం మొదలు పెట్టలేని పరిస్థితులు మరో ప్రాంతంలో నెలకొన్నాయి. హర్యానాలో అధిక వర్షపాతం వలన రైతుతు వరి, ఇతర పంటలు నష్టపోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి చోట్ల కొండచరియలు విరిగిపడి, భారీ వరదలు సంభవించి భారీ స్థాయిలో యాపిల్‌ పంటకు నష్టం వాటిల్లింది. ఇటు కూర్గ్‌ వంటి ప్రాంతాల్లో కావేరీ పరివాహకంలో లోటు వర్షపాతం నమోదైంది.

గత నాలుగేళ్ల కాలాన్ని చూస్తే ఈసారి రుతుపవనాలు చాలా ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. ముందుకు కదిలే విషయంలోనూ దోబూచులాడాయి. అయితే.. బలమైన రుతుపవనాలకు అవకాశం ఉందా లేదా అనేది జూలై నెలాఖరుకు కానీ చెప్పలేమని గురుప్రసాద్‌ శర్మ తెలిపారు. రుతుపవనాలు బలంగా ఉంటాయా, బలహీనపడిపోతాయా అన్నది అప్పటికి తేలుతుందన్నారు. 2000 సంవత్సరం నుంచి చూస్తే.. ఇప్పటి వరకూ ఆరు ఎల్‌ నిన్యో సంవత్సరాలు ఉంటే.. అందులో ఐదు సార్లు కరువు సంభవించిందని స్కైమెట్‌ పేర్కొన్నది. ఇందులో రెండు తీవ్ర కరువు పరిస్థితులు కాగా, 2018లో దాదాపు కరువు పరిస్థితులు ఏర్పడాయని పేర్కొన్నది.

Exit mobile version