Site icon vidhaatha

22న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

♦  సీపీఐ నేత బాల మల్లేష్

♦ పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ కు నిరసన

పార్లమెంట్ సభ్యుల అప్రజాస్వామిక సస్పెన్షన్లను నిరసిస్తూ ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుఎన్ బాలమల్లేశ్ పేర్కొన్నారు. గురువారం షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో జరిగిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ చర్యలకు పూనుకుంటోందన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయని, విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనపై సమగ్ర చర్చ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, దేశభద్రతను కాపాడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయన్నారు.


దానిపై సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు బీజేపీ ప్రభుత్వ ప్రయత్నిస్తోందన్నారు. నిలదీస్తున్న 143 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని బాలమల్లేశ్ తీవ్రంగా ఖండించారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్లమెంట్ లో నిరంకుశంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.


ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామిక శక్తులు పెద్దఎత్తున తరలివచ్చి నిరసనలు జయప్రదం చెయ్యాలని కోరారు. సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలు గౌడ్ మాట్లాడుతూ, 22న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు చేపట్టే ధర్నాను జయప్రదం చెయ్యాలని కోరారు.


గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, వాటి రక్షణ కోసం సీపీఐ తరపున పోరాటం సాగిస్తామని అన్నారు. అర్హత కలిగిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు దామోదర్ రెడ్డి, ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దశరథ్, లక్ష్మీ, శంకర్ రావ్, కృష్ణమూర్తి, శంకర్, వెంకటరెడ్డి, రచ్చ కిషన్, స్వామి పాల్గొన్నారు.

Exit mobile version