వైవాహిక బంధానికి హాస్యం దివ్య ఔషధం .. వెల్లడించిన అధ్య‌య‌నం

ప్రేమ లేదా వైవాహిక బంధం సుఖంగా సాగిపోవ‌డానికి.. చివ‌రి వ‌ర‌కు నిల‌బ‌డ‌టానికి దంప‌తుల మ‌ధ్య హాస్య సంభాష‌ణ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాజా అధ్య‌య‌నం (Study) ఒకటి తేల్చి చెప్పింది

  • Publish Date - November 25, 2023 / 11:43 AM IST

విధాత‌: ప్రేమ లేదా వైవాహిక బంధం (Relationship) సుఖంగా సాగిపోవ‌డానికి.. చివ‌రి వ‌ర‌కు నిల‌బ‌డ‌టానికి దంప‌తుల మ‌ధ్య హాస్య సంభాష‌ణ (Humour) ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాజా అధ్య‌య‌నం (Study) ఒకటి తేల్చి చెప్పింది. భాగ‌స్వామి ప‌ట్ల ఆస‌క్తిని, ప్రేమ‌ను పెంచే శ‌క్తి హాస్యానికి ఉంద‌ని పేర్కొంది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పెంచే అంశాల్లో హాస్యం ఒక‌ట‌ని ఇది వ‌ర‌కే నివేదిక‌లు వెల్ల‌డించిన‌ప్ప‌టికీ.. దానిపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గలేదు.


తొలిసారి ఈ కోణంలో సింగ‌పూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలోని సైకాల‌జీ ప్రొఫెస‌ర్ కెన్నెత్ టేన్ నేతృత్వంలో అధ్య‌య‌నం జ‌రిగింది. ఒక బంధం మొద‌లు అయ్యే స‌మ‌యం నుంచి ఈ హాస్య సంభాష‌ణ అనేది ఎలా ప్ర‌భావం చూపుతుంద‌నే అంశాన్ని అధ్య‌య‌నంలో ప్ర‌ధానంగా చ‌ర్చించామ‌ని టేన్ పేర్కొన్నారు. ‘ఎప్పుడూ ఆహ్లాదంగా… న‌వ్వుతూ.. న‌వ్విస్తూ ఉండేవారు చుట్టుప‌క్క‌ల వారిని ఆకర్షిస్తారు. అదే వైవాహిక బంధానికీ వ‌ర్తిస్తుంది.


పెళ్లి అయ్యాక మ‌నం ఆనందంగా ఉంటే.. మ‌న భాగ‌స్వామితోనూ స‌ర‌దాగా ఉంటాం. ఒక‌వేళ వారి స్వ‌భావం ముభావంగా ఉండేది అయినా.. మ‌న ద్వారా మార్పు వ‌స్తుంది’ అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ అధ్య‌య‌నం కోసం వారు 108 జంట‌ల‌ను ఎంచుకొన్నారు. వీరి బంధం స‌గ‌టు వ‌య‌సు 18.27 నెల‌లు. వీరి సంభాష‌ణ‌ల్లో హాస్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించ‌డానికి వ‌రుస‌గా ఏడు సాయంత్రాలు వారిని క‌లుసుకుని.. ఆరోజు వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను న‌మోదు చేసుకునేవారు. వారి మ‌ధ్య జ‌రిగిన హాస్య‌పు సంభాష‌ణలు, గొడ‌వ‌లు, పొడి పొడి మాట‌లు ఇలా అన్నింటినీ తెలుసుకునేవారు.


అలాగే దంప‌తులు క‌లిసి గ‌డిపే స‌మయాన్నీ న‌మోదు చేసుకున్నారు. ఆ స‌మాచారాన్ని విశ్లేషించి చూడ‌గా.. త‌మ బంధం ప‌ట్ల శ్ర‌ద్ధ‌, భాగ‌స్వామిని సంతోషంగా ఉంచాల‌ని అనుకునే వారు ఎక్కువ‌గా హాస్య సంభాష‌ణ‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని తెలుసుకున్నారు. దీనికి వ్య‌తిరేకంగా ఉన్నవారు ముభావంగా.. త‌డిపొడి మాటల‌తో భాగ‌స్వామిని నిరాశ ప‌రుస్తున్నార‌ని అధ్య‌య‌నంలో తేలింది.


అంతే కాకుండా క‌లిసి గ‌డిపే స‌మ‌యం తక్కువే ఉన్న‌ప్ప‌టికీ.. న‌వ్వుతూ న‌వ్విస్తూ మాట్లాడితే భాగ‌స్వామికి మ‌నపై ప్రేమ ఎక్కువ‌గా క‌లుగుతుంద‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు పేర్కొన్నారు. అయితే యువ‌తుల‌తో పోలిస్తే యువ‌కులే హృద్య‌మైన, ఆహ్లాద‌క‌ర‌మైన మాట‌ల‌ను ఎక్కువ మాట్లాడుతున్నార‌ని అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్న వారంతా అప్పుడే కాలేజీల నుంచి వ‌చ్చిన‌వార‌నీ.. మ‌ధ్య‌వ‌య‌స్కుల విష‌యంలో ఈ ఫ‌లితాలు కాస్త మారితే మారొచ్చ‌ని టేన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News