Site icon vidhaatha

Suryapeta | సమీకృత మార్కెట్‌ ప్రారంభానికి సిద్ధం.. కలెక్టర్‌తో కలిసి సందర్శించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

Suryapeta

విధాత: సూర్యాపేట సమీకృత మార్కెట్‌ నిర్మాణం పూర్తయ్యింది. సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్తు శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి చొరవతో సూర్యాపేట పట్ణణంలో రూ.30కోట్లతో నిర్మించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో మార్కెట్‌లో జరుగుతున్న సెంట్రల్ కూలింగ్ సిస్టం నిర్మాణ పనులను మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శుక్రవారం కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి లతో కలిసి సందర్శించారు. మార్కెట్ మొత్తం సమీకృత భవనం లోపలే ఉండటంతో సరుకుల కొనుగోలుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం భవనం నలువైపులా సెంట్రల్ కూలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మార్కెట్ లో ఏర్పాటు చేసే టేబుల్స్ నాణ్యతను పరిశీలించారు. మార్కెట్‌ ప్రారంభం నాటికి సెంట్రల్ కూలింగ్ సిస్టం పనులు పూర్తి చేయాలని ఆదేశించి పలు సూచనలు చేశారు.

కాగా సూర్యాపేట పట్టణం మధ్యలో, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం ప్రజలకు, వ్యాపారులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రైతులు, వ్యాపారులు ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ కూరగాయలు అమ్ముకునేవారు. వర్షకాలమైతే పరిస్థితి వర్ణనాతీతం. ఆ ప్రాంతమంతా బురదమయమయ్యేది.

పందులు స్వైరవిహారం చేసేవి. ఈ క్రమంలో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని గుర్తించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి పట్టణంలోని ఆయా వార్డుల్లో పర్యటించిన సందర్భంగా మార్కెట్‌ పరిస్థితిని గమనించారు.

నిధులు మంజూరు చేయించి కూరగాయాలు, మాంసం, చికెన్‌ తదితరవి అన్నీ ఒకే చోట లభించేలా ఈ సమీకృత మార్కెట్‌ను నిర్మించారు. ఈ మార్కెట్‌తో కూరగాయలు అమ్ముకునే రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులకు ఎండాకాలం, వానకాలంలో కలిగే ఇబ్బందులు తప్పినట్లయింది.

Exit mobile version