విధాత: షారుక్ ఖాన్ సినిమా స్వదేశ్‌లో నటించిన నటి గాయత్రి జోషి (Gayathri Joshi) ఇటలీలో కారు ప్రమాదానికి గురయ్యారు. తన భర్త వికాస్ ఒబెరాయ్‌తో కలిసి లగ్జీరియస్ కారు లంబోర్గినిలో వెళుతుండగా మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి సార్దీనియా అనే ప్రాంతానికి వెళ్లిన ఈ జంట సార్దీనియా సూపర్‌కార్ టూర్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందులో లంబోర్గిని, ఫెరారీ, పోర్షే వంటి లగ్జీరియస్ కార్లలో జంటలు పోటీ పడతాయి. టెలౌడా అనే ప్రాంతం నుంచి ఓల్బియా అనే ప్రాంతం వరకు ఈ రేస్ జరుగుతుంది. ఇందులో భాగంగానే గాయత్రి దంపతులు తమ లంబోర్గినిలో ప్రయాణిస్తున్నారు. అయితే ఫెర్రారీని నడుపుతున్న మరో జంట వీరి కారుతో పాటు మరికొన్ని కార్లను, ఒక వ్యాన్‌ను భారీ వేగంతో ఢీకొట్టింది.
ప్రమాదంలో వీరి కారు బోల్తా పడిందని ప్రస్తుతం గాయత్రి, వివేక్ క్షేమంగా ఉన్నారని వారి మేనేజర్ ధ్రువీకరించారు. అయితే ఫెర్రారీని నడిపి ప్రమాదానికి కారణమైన మెలిసా క్రౌతీ (63), మార్కస్ క్రౌతీ (67) దంపతులు మాత్రం మృతి చెందారు. వీరి కారు మంటల్లో చిక్కుకుపోవడంతో కాపాడటానికి సాధ్యపడలేదని సమాచారం. వీరు స్విట్జర్లాండ్‌కు చెందినవారుగా గుర్తించారు.