Doomsday Fish: సముద్రంలో జీవించే రకరకాల జీవరాశులలో అరుదైన జలచరాలు ఎన్నో ఉన్నాయి. అవి తీరానికి సమీపంగా వచ్చినప్పుడు లేక జాలర్ల వలలకు చిక్కినప్పుడు వాటిని వింతగా కొత్తగా చూడటం జరుగుతుంది. తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళనాడు జాలర్లకు ఓ అరుదైన జాతి వింత చేప వలలో చిక్కింది. జాలర్లకు చిక్కిన దాదాపు 20అడుగుల పొడవు ఉన్న ఈ వింత చేప వీడియో వైరల్ గా మారింది. అది డూమ్స్ డే ఫిష్ జాతి చేపగా గుర్తించారు. పొడవైన శరీరంతో మెరిసే పొలుసులు కలిగిన డూమ్స్ డే ఫిష్ లోతైన సముద్ర జీవి. ఈ చేపలు నవంబర్ లో కాలిఫోర్నియా బీచ్ లో, ఫిబ్రవరిలో మెక్సికలో ఫసిఫిక్ తీరంలో, ఇటీవల ఆస్ట్రేలియా తీరంలోకి కొట్టుకుని వచ్చాయి. సముద్రంలో 200మీటర్ల దిగువన నివసించే డూమ్స్ డే చేపలు అరుదుగా తీరానికి కొట్టుకొస్తుంటాయి.
జపాన్ పురాణాల ప్రకారం డూమ్స్ డే అంటే ‘ప్రళయ దినం’ అని అర్థం. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించబోయే ముందు ఈ చేప తీరప్రాంతంలో కనిపిస్తుందట.‘మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్’ గా దీనిని జపానీయులు భావిస్తుంటారు. సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందని నమ్ముతుంటారు. 2011లో జపాన్‌లో సముద్రంలోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు 20 తీర ప్రాంతంలో కనిపించడంతో వారి ఈ చేపలను విపత్తు సంకేతాలుగా భావిస్తుంటారు.