విధాత : త్వరలో ఎన్నికలు జరుగబోతున్న తమిళనాడు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ద్వార ఏకంగా 74లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. రాష్ట్రంలో మొత్తం 5.67కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే 74లక్షల మంది ఓటర్లు తగ్గడం గమనార్హం.
గతేడాది అక్టోబరు చివరి నాటికి రాష్ట్రంలో 6.41కోట్ల మంది ఓటర్లు ఉండగా..‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత గతేడాది డిసెంబరు 19న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. అందులో ఓటర్ల సంఖ్యను 5.43కోట్లుగా పేర్కొంది. అంటే.. దాదాపు 97లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. అనంతరం ఓటు హక్కు కోల్పోయిన వారు అభ్యంతరాలు తెలిపేందుకు కొంత గడువు కల్పించింది. వారి దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 27.53లక్షల మంది అర్హులైన ఓటర్లను చేర్చింది. 4.23లక్షల మంది అనర్హులను జాబితా నుంచి తొలగించింది. నేడు (ఫిబ్రవరి 23న) రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం తమిళనాడులో 5.67కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే గతంలో పోలిస్తే ఓటర్ల సంఖ్య 74లక్షల మేర తగ్గినట్లయ్యింది. అత్యధికంగా చెంగల్‌పట్టు జిల్లాలోని 27-శోలింగనల్లూర్ స్థానంలో 5.36లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా చెన్నైలోని 18-హార్బర్ నియోజకవర్గంలో 1.16లక్షల ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది.
తమిళనాడు ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే నెలతో ముగియనుంది. అంతకంటే ముందు ఏప్రిల్‌లో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో నటుడు విజయ్ టీవీకే పార్టీతో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెడుతున్నారు. డీఎంకే కూటమి, బీజేపీ-అన్నాడీఎంకే, టీవీకే పోరుతో ఈసారి ఎన్నికలు రసవత్తంగా మారబోతున్నాయి.
ఇవి కూడా చదవండి :
TVK Chief Vijay : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నాకు, స్టాలిన్ కు మాత్రమే
Gold, Silver Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు !
