Tammineni Veerabhadram
విధాత: దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బిజెపి తెలంగాణలో పాగ వేసేందుకు చేసే కుట్రలను తిప్పి కొట్టడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కల్వకుంట్ల గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో నూతనంగా నిర్వహించిన సిపిఎం కార్యాలయం, కామ్రేడ్ మాజీ సర్పంచ్ బొందు పెద్ద నరసింహ అమరవీరుల స్మారక భవనమును ఆయన ప్రారంభించారు. ఆ గ్రామ అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించి సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరించి గ్రామంలో ప్రధాన వీధుల నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో కళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాలలో మళ్లీ ఎర్రజెండా కీలక పాత్ర పోషించే రోజులు వచ్చాయని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఎర్రజెండా కీలకపాత్ర పోషించిందన్నారు. మతోన్మాద బిజెపిని బొంద పెట్టడంలో కమ్యూనిస్టులు ముందుండి నడిచారన్నారు. అదే తరహాలో దేశంలో మతోన్మాద పేరుతో ముందుకొస్తున్న బిజెపిని ఎండగట్టేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బిజెపి వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే కాకుండా బిజెపిని తరిమికొట్టేందుకు ముందుకొస్తున్న పార్టీలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో దేశం నుండి బిజెపిని తరిమికొట్టేందుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం బిజెపికి వ్యతిరేకంగా పోరాడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కల్యాణ లక్ష్మి, ధరణి సమస్యలు పోడు భూముల పట్టాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో వీఆర్ఏల సమస్యను పరిష్కరించినందుకు ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే తరహాలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్ల, ఆయాల సమస్యలతో పాటు వివిధ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల రూపాయలు ప్రస్తుతం పెరిగిన ధరలకు ఇల్లు నిర్మాణం చేపట్టలేరని, కేంద్ర ప్రభుత్వం పది లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కలకుంట్ల గ్రామం చిన్నదైనప్పటికీ ఆ గ్రామంలో సిపిఎం పార్టీ పై మమకారంతో ప్రతి ఒక్కరి కృషితో సిపిఎం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కలకుంట్ల గ్రామ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల గ్రామస్తులు ఇతర గ్రామాలలో కళా ప్రదర్శన చేసి పార్టీ కార్యాలయం కోసం 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేయడం గర్వకారణమన్నారు. అమెరికా దేశంలోని క్యూబా రాష్ట్రం లాంటిది కల్వకుంట్ల గ్రామమన్నారు. అమెరికా దేశంలో క్యూబా రాష్ట్రాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా దేశస్థుల రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నం లాగానే కలకుంట్ల గ్రామాన్ని పాలించేందుకు ఎంతో కుట్ర చేసినప్పటికీ వారి కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారని తెలియజేశారు.
మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు తెచ్చిన ఉప ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పేందుకు ఉపయోగపడిన కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా పోషించిందన్నారు. దేశంలో మతతత్వ శక్తులను దేశంలో అధికారంలో ఉండకుండా చేయడమే సిపిఎం పార్టీ ప్రధాన ఏజెండాని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, జిల్లా నాయకులు నాంపల్లి చంద్రమౌళి, మునుగోడు, మర్రిగూడ మండలాల కార్యదర్శులు మిర్యాల భరత్ కుమార్, ఏర్పుల యాదయ్య, డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఐతగోని విజయ్ కుమార్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొట్ట శివకుమార్, వెల్మకన్నె ఎంపీటీసీ చాపల మారయ్య, మండల నాయకులు నారగోని నరసింహ, యాసరాని శ్రీను, జిల్లా యాదయ్య, ఐతగొని యాదయ్యగౌడ్, వేముల లింగస్వామి, వరికుప్పల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.